India vs West Indies : తొలి టెస్ట్ మ్యాచ్ లో టీం ఇండియాదే ఆధిపత్యం.. టీం ఇండియా బౌలర్ల దెబ్బకు వెస్టిండీస్

భారత్ - వెస్టిండీస్ ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీం ఇండియా ఆధిక్యాన్ని ప్రదర్శించింది.

Update: 2025-10-03 02:04 GMT

భారత్ - వెస్టిండీస్ ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీం ఇండియా ఆధిక్యాన్ని ప్రదర్శించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ ను తక్కువ పరుగులకు అవుట్ చేయడమే కాకుండా భారత్ భారీ స్కోరు దిశగా వెళుతుంది. అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే తక్కువ స్కోరుకే వెస్టిండీస్ ను భారత్ బౌలర్లు పరిమితం చేయగలిగారు. వెస్టిండీస్ కేవలం 44.1 ఓవర్లలోనే ఆల్ అవుట్ అయింది. 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. వెస్టిండీస్ బ్యాటర్లలో అత్యధికంగా జస్టిస్ గ్రీప్స్ 32 పరుగులు చేశాడు. తర్వాత షైహోప్ ఇరవై పరుగులు చేశాడు. మిగిలిన వాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు.

రెండు సెషన్లలోనే ముగించి...
భారత్ బౌలర్లలో హైదరాబాదీ ఆటగాడు మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీసి వెస్టిండీస్ ను బలంగా దెబ్బతీశాడు. జస్పిత్ బుమ్రా మూడు వికెట్లు తీసి వెస్టిండీస్ వెన్ను విరిచాడు. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీసుకుని వెస్టిండీస్ ను ఆల్ అవుట్ చేయగలిగారు. తొలి రోజు ఆటలో లంచ్ బ్రేక్ కు ముందు.. బ్రేక్ తర్వాత వెంటనే ఆల్ అవుట్ కావడంతో వెంటనే భారత్ బ్యాటింగ్ ప్రారంభమయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని నాటౌట్ గా నిలిచాడు. కేఎల్ రాహుల్ 114 బంతులు ఆడి ఆరు ఫోర్లు బాది ఈ స్కోరును సాధించగలిగాడు. మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ మాత్రం 36 పరుగులు చేసి అవుటయ్యాడు. అర్ధ సెంచరీని చేజార్చుకున్నాడు.
41 పరుగుల వెనుకంజలో....
ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని టాప్ స్కోరర్ గా నిలవగా, కెప్టెన్ శుభమన్ గిల్ మాత్రం తొలి రోజు ఆట ముగిసే సమయానికి పద్దెనిమిది పరుగులు చేశాడు. సాయి సుదర్శన్ ఏడు పరుగులకే అవుటయ్యాడు. వెస్టిండీస్ బౌలర్లలో జైడెన్ సీల్స్, రోస్టన్ ఛేజ్ తలో వికెట్ల దక్కంచుకున్నారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 121 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయినట్లయింది. ప్రస్తుతం భారత్ వెస్టిండీస్ విధించిన లక్ష్యానికి 41 పరుగుల వెనకంజలో ఉంది. ఈరోజు ఆటలో కేఎల్ రాహుల్, శుభమన్ గిల్ నిలబడగలిగితే భారత్ భారీ స్కోరు చేసే అవకాశముంది. మొదటి టెస్ట్ మ్యాచ్ లోనూ భారత్ విజయం సాధించే అవకాశాలను కొట్టిపారేయలేమన్నది క్రీడానిపుణుల అంచనా.
Tags:    

Similar News