T20 World Cup : తోపు టీంలకు షివరింగ్...తగ్గేదే లేదంటున్నఅంచనా లేని జట్లు

టీ20 ప్రపంచ కప్ లో చిన్న టీంలను అలక్ష్యం చేస్తూ బరిలోకి దిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

Update: 2026-02-11 04:33 GMT

టీ20 ప్రపంచ కప్ లో చిన్న టీంలను అలక్ష్యం చేస్తూ బరిలోకి దిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ నెల 7వ తేదీన ప్రారంభమయిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకూ సూపర్ 8లో కూడా రాని జట్లు ప్రత్యర్థులను అల్లాడిస్తున్నాయి. ఉదాహరణకు పాకిస్తాన్ ను నెదర్లాండ్ వణికించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 19.5 ఓవర్లు ఆడి 147 పరుగులు చేసింది. అయితే ఆ 147 పరుగులు చేయడానికి పాకిస్తాన్ చెమటోడాల్సి వచ్చింది. చివరకు పాక్ ఏడు వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో లక్ష్యాన్నిఅధిగమించి గెలిచింది కానీ.. టెన్షన్ పడిందనే చెప్పాలి.

భారత్ కు తప్పని భయం...
ఇక అమెరికాతో భారత్ ముంబయి వేదికగా జరిగిన మ్యాచ్ లోనూ భారత్ తడబడింది. ఒకరకంగా చెప్పాలంటే క్రికెట్ లో పసికూన అమెరికా టీం ఇండియాను షేక్ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఇరవై ఓవర్లు ఆడి 9 వికెట్లకు 161 పరుగులు చేసింది. భారత్ భారీ పరుగులు చేస్తుందని భావించినప్పటికీ అమెరికా బౌలర్లు టీం ఇండియా బ్యాటర్లను బెంబేలెత్తించారు. 13వ ఓవర్‌లో ఆరు వికెట్లు కోల్పోయి 77 పరుగులు మాత్రమే చేయగలిగింది. సూర్యకుమార్ యాదవ్ ఒత్తిడిల మధ్య బ్యాటింగ్ కు దిగి 84 పరుగులు చేయడంతో గౌరవప్రదమైన స్కోరు లభించింది. భారత్‌ అమెరికాపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది.
వణికిన ఇంగ్లండ్...
ఇక టీ20 వరల్డ్ కప్ లో రెండుసార్లు ఛాంపియన్ గా నిలిచిన ఇంగ్లండ్ ను నేపాల్ ఒకరకంగా గెలిచినంత పనిచేసింది. చివరి బాల్ వరకూ ఉత్కంఠ నెలకొంది. చివరకు ఇంగ్లండ్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ నేపాల్ మాత్రం ఇంగ్లండ్ ఆటగాళ్లలో ఓటమి భయం కనిపించింది. ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసి ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. కానీ నేపాల్ కూడా తగ్గలేదు. ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయిన నేపాల్ 180 పరుగులు మాత్రమే చేయడంతో ఇంగ్లండ్ తృటిలో ఓటమి నుంచి తప్పించుకుంది. అందుకే పసికూనలని ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అందుకు మాజీ ఛాంపియన్లు, డిఫెండింగ్ ఛాంపియన్లు, తోపు టీంలు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News