IPL 2026 : గుజారాత్ టైటాన్స్ పై పంజాబ్ కింగ్స్ ఉత్కంఠ మధ్య విజయం

గుజరాత్ టైటాన్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది.

Update: 2026-04-01 02:22 GMT

గుజరాత్ టైటాన్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. అయితే చివర వరకూ ఉత్కంఠ నెలకొంది. తక్కువ స్కోరు అయినా సరే ఇరు జట్లు బ్యాటింగ్ లో కొంత ఇబ్బంది పడటం, బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చివరకు పంజాబ్ కింగ్స్ కే విజయం లభించింది. టాస్ గెలుచుకున్న పంజాబ్ కింగ్స్ తొలుత ఫీల్డింగ్ ను ఎంచుకుంది. బ్యాటింగ్ కు బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 162 పరుగులకే పరిమితమయింది. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేశారు.యజ్వేంద్ర చాహల్ నాలుగు ఓవర్లలో 28 పరుగులకు రెండు వికెట్లు తీసి మధ్య ఓవర్లలో గుజరాత్ పరుగుల వేగం తగ్గించాడు. వ్యాసక్ 3 వికెట్లు తీసి కీలకంగా నిలిచాడు. దీంతో గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులకే పరిమితమైంది.

టార్గెట్ ను ఛేదించేందుకు...
అనంతరం 163 పరుగుల చేధనలో పంజాబ్ ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. రబడా బౌలింగ్ లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ గా వచ్చిన ప్రియాంశ్ ఆర్య ఇబ్బంది పడి ఔటయ్యాడు. ఆ తర్వాత కానొల్లి,ప్రభ్ సిమ్రాన్ లు కలిసి రెండో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గాడిలో పెట్టారు. ఇద్దరూ వరుసగా బౌండరీలు, సిక్సర్లు కొట్టి గుజరాత్ బౌలర్లపై ఒత్తిడి తెచ్చారు.ప్రభ్‌సిమ్రన్ 24 బంతుల్లో 37 పరుగులు చేసి ఔటయ్యాక గుజరాత్ తిరిగి పోటీలోకి వచ్చింది. ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేసి వరుస వికెట్లు తీసాడు. మూడు వికెట్లు తీయడంతో ఒక దశలో పంజాబ్ కష్టాల్లో పడినట్లయింది.
చివరి ఓవర్ వరకూ...
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్, స్టోనిస్ లను వరసగా అవుట్ చేయడంతో మ్యాచ్ గెలుపు పై ఉత్కంఠ తలెత్తింది. వాషింగ్టన్ సుందర్ కూడా ఒక వికెట్ తీశాడు. దీంతో గెలుపు చివరి వరకూ దోబూచులాడింది. అయితే కానొల్లి చివరివరకు నిలబడి 44 బంతుల్లో 72 పరుగులు చేశాడు. ఐదు సిక్సర్లు, ఐదు ఫోర్లు కొట్టి జట్టును గెలిపించాడు. పంజాబ్ ఐదు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని అందుకుంది. దీంతో పంజాబ్ కింగ్స్ ఆరంభ మ్యాచ్ లో సునాయాస విజయం సాధించకపోయినా కష్టపడి గెలిచింది. గుజరాత్ టైటాన్స్ శ్రమ ఫలించలేదు. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్‌లో కెప్టెన్ శుభమన్ గిల్ 39, బట్లర్ 33 బంతుల్లో 38 పరుగులు చేశారు.


Tags:    

Similar News