IPL 2026 : అదిరిన ఆరంభ మ్యాచ్.. హైదరాబాద్ పై బెంగళూరు అలవోక విజయం
ఆరంభ మ్యాచ్ అదిరింది. డిఫెండింగ్ ఛాంపియన్ విజేతగా నిలిచిం
ఆరంభ మ్యాచ్ అదిరింది. డిఫెండింగ్ ఛాంపియన్ విజేతగా నిలిచింది. సొంత మైదానం బెంగళూరులో తమకు ఎదురులేదని నిరూపించింది. భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. కేవలం ముగ్గురే 202 పరుగుల టార్గెట్ ను ఛేదించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు తొలి విజయాన్ని అందించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుతమైన ప్రదర్శన చూపింది. 202 పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మీద కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించగలిగింది. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ఛాంపియన్ కు తిరుగులేదని చాటి చెప్పింది.
సన్ రైజర్స్ తడబడి...
టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. అభిషేక్ శర్మ తక్కువ పరుగులకే అవుటయ్యాడు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో కెప్టెన్ ఇషాన్ కిషన్, అంకిత్ వర్మ తప్పించి పెద్దగా ఎవరూ ఆడలేకపోయారు. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఈ స్కోర్‌లో ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడి 80 పరుగులు చేశాడు. అంకి్ వేగంగా 43 పరుగులు జోడించాడు. అయితే బెంగళూరు బౌలర్లు కీలక దశల్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా జాకబ్ డఫీ 22 పరుగులకు 3 వికెట్లు తీసి మ్యాచ్‌ను తమ వైపునకు తిప్పాడు. సాల్ట్ అద్భుతమైన క్యాచ్ లు చూసి తీరాల్సిందే.
లక్ష్య ఛేదనలో ...
202 పరుగుల లక్ష్య ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. దేవదత్ పడిక్కల్ కేవలం 26 బంతుల్లో 61 పరుగులు చేసి జట్టుకు శుభారంభం అందించాడు. తరువాత విరాట్ కోహ్లి నిలకడగా ఆడి 38 బంతుల్లో అజేయంగా 69 పరుగులు చేశాడు. కెప్టెన్ రజిత్ పాటీదార్ 12 బంతుల్లో వేగంగా 31 పరుగులు జోడించాడు. మధ్యలో రెండు వికెట్లు త్వరగా కోల్పోయినా బెంగళూరు ఆధిపత్యాన్ని కోల్పోలేదు. నాలుగు ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుని సమగ్ర ప్రదర్శనతో విజయం ఖరారు చేసింది. విరాట్ కొట్టిన షాట్లను చూసి కామెంటేటర్లు కూడా ఇక అతనిలో ఏమాత్రం చేవ తగ్గలేదని వ్యాఖ్యనించడం విశేషం. తొలి విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్ అని అనిపించుకుంది.