T20 World Cup : టీం ఇండియాతో పాక్ 15న ఆడకపోయినా.. మరోసారి ఆడాల్సిందేనా?
టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ షిప్ కు వేళయింది. మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంది
టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ షిప్ కు వేళయింది. మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నెల 15వ తేదీన కొలొంబోలో భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం భారత్ తో మ్యాచ్ లు ఆడబోమని స్పష్టం చేసింది. దీంతో ఐసీసీ ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరుపుతుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డును కూడా సంప్రదింపులు జరుపుతోంది. అయితే భారత్ - పాక్ ల మధ్య మ్యాచ్ జరగకపోతే ప్రకటనల రూపంలో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లనుంది. అంచనాల ప్రకారం 4,500 కోట్లు నష్టం వస్తుంది. పాకిస్తాన్ - భారత్ మ్యాచ్ ల అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది చూస్తారు. అందుకే ప్రకటనల జోరు ఎక్కువగా ఉంటుంది. అందుకే భారత్ - పాకిస్తాన్ ల మధ్య మ్యాచ్ లంటే పిచ్చ క్రేజ్.
ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడంతో...
అయితే పాకిస్తాన్ ఇప్పటి వరకూ భారత్ తో మ్యాచ్ ఆడే విషయంలో పాకిస్తాన్ కంట్రోల్ బోర్డు అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. కేవలం పాకిస్తాన్ ప్రభుత్వ వైఖరి మాత్రమే వెల్లడయింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. భారత్ తో మ్యాచ్ ఆడకపోయినా.. పాకిస్తాన్ సెమీ ఫైనల్స్ కు చేరుకునే అవకాశాలున్నాయి. ఏదైనా ఊహించని మలుపు జరిగితే తప్ప పాక్ సెమీ ఫైనల్స్ అవకాశాలను ఎవరూ కొట్టిపారేయలేరు. పాకిస్తాన్ ఆడే మ్యాచ్ లన్నీ ఒకే వేదికగా ఆడుతుండటంతో పిచ్ పై పట్టు సాధిస్తుంది. శ్రీలంకలోని రెండు స్టేడియాల్లోనే ఈ మ్యాచ్ లన్నీ ఆడనుంది. అందుకే ఏమాత్రం ప్రయాణ అలసట ఉండదు. ప్రాక్టీస్ కు తగినంత సమయం పాక్ కు సులువుగా దొరుకుతుంది.
రెండూ ఒక గ్రూపులో ఉండటంతో...
భారత్, పాక్ లు గ్రూప్ ఏ లో ఉన్నాయి. ఈ రెండు దేశాలతో పాటు నెదర్లాండ్, నమీబియా,అమెరికా జట్లతో ఆడాల్సి ఉంటుంది. పాకిస్తాన్ తొలి మ్యాచ్ ను ఫిబ్రవరి 7వ తేదీన నెదర్లాండ్స్ తో ఆడనుంది. పదిన అమెరికాతో, 18న నమీబియాతో తలపడాల్సి ఉంది. భారత్ తో ఈ నెల 15వ తేదీ మ్యాచ్ పాకిస్తాన్ ఆడకపోయినప్పటికీ గ్రూపు ఎ లో ఉన్న నెదర్లాండ్స్, నమీబియా, అమెరికాలను ఓడించి పాకిస్తాన్ సునాయాసంగా సెమీ ఫైనల్ కు చేరుకోనుంది. లీగ్ దశలో ఈ రెండు జట్లు ఒకే గ్రూపులో ఉండటంతో సూపర్ 8 లో మాత్రం వేర్వేరు గ్రూపుల్లో ఆడనున్నాయి. సూపర్ 8లో రెండు దేశాలు విజయం సాధిస్తే సెమీ ఫైనల్స్ లోనో, ఫైనల్స్ లోనూ భారత్ - పాక్ లు తలపడే అవకాశాలుంటాయి. అందుకే పాకిస్తాన్ భారత్ తో మ్యాచ్ ఆడకపోయినా సులువుగా సెమీ ఫైనల్స్ కు చేరుకుంటుందనడంలో ఎలాంటి సందేహంలేదు.