India vs England First Test: చేజేతులా చేజార్చుకున్న మ్యాచ్ ఇది.. తొలి టెస్ట్ లో భారత్ ఓటమి
యంగ్ ఇండియా చివరకు చేతులెత్తేసింది. అంది వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంది. దీంతో తొలి టెస్ట్ లోనే భారత్ ఓటమి పాలయింది
యంగ్ ఇండియా చివరకు చేతులెత్తేసింది. అంది వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంది. దీంతో తొలి టెస్ట్ లోనే భారత్ ఓటమి పాలయింది. ఎన్ని సెంచరీలు సాధిస్తే ఏం? సరైన సమయంలో వికెట్లు తీయలేకపోవడం, బ్యాటర్లలో కొందరి వైఫల్యం వెరసి తొలిటెస్ట్ ను ఇంగ్లీష్ జట్టుకు సమర్పించుకోవాల్సి వచ్చింది. మ్యాచ్ ను ఎంతో ధాటిగా ఆరంభించిన భారత జట్టు చివరి విషయానికి వచ్చేసరికి చేష్టలుడిగి చూడాల్సి వచ్చింది. బాగా ఆడి ఓడిందని భావించాలా? లేక స్వీయ తప్పిదాల వల్ల చేజేతులా మ్యాచ్ ను ప్రత్యర్థికి అప్పగించిందా? అన్నది మాత్రం విశ్లేషణలు జరగాల్సి ఉంది. కొంత నిర్లక్ష్యం, కొంత అతి ధీమాకు పోవడం కూడా టీం ఇండియా జట్టు కొంప ముంచిందనే చెప్పాలి.
డ్రా గా కూడా ముగించలేక...
ఐదు టెస్ట్ ల సిరీస్ కోసం విజయంతో మొదలుపెట్టేందుకు వచ్చిన అవకాశాన్ని టీం ఇండియా చేజార్చుకుంది. కనీసం మ్యాచ్ ను డ్రాగా ముగుస్తుందని భావించినా చివరకు జట్టు ఓటమి పాలు కావడం ఇబ్బందికరమైన విషయమే. కేవలం 371 పరుగుల లక్ష్యాన్ని సొంత గడ్డపై ఆడుతున్న ఇంగ్లండ్ ముందు ఉంచితే అది వారికి పెద్ద స్కోరు కాదు. కానీ వికెట్లు కొంత తీయగలగిన సమయంలోనూ, మైదానంలో ఫీల్డింగ్ రూపంలోనూ ఇంగ్లీష్ జట్టుకు లక్కు కలసి వచ్చింది. బెన్ 149 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. జాక్ క్రాలీ 65 పరుగులు, జోరూట్ 53 పరుగులు, జేమీ స్మిత్ నలభై నాలుగు విలువైన పరుగులు చేసి విజయాన్ని తమ వైపునకు లాగేసుకున్నారు.
రెండో ఇన్నింగ్స్ లో...
బూమ్రా బంతులు కూడా పనిచేయకపోవడం, బూమ్రా వదిలిన బాల్స్ ను అలవోకగా ఫోర్లకు దాటించడంతో వారికి మరింత సులువయింది. ప్రసిద్ధ్ కృష్ణ రెండు, శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు తీయగలిగారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 471 పరుగుల చేయగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 465 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలి ఇన్నింగ్స్ లోనే ముగ్గురు సెంచరీలు సాధించినా తర్వాత వచ్చిన వారు వరసగా అవుట్ కావడంతో భారత్ జట్టు తక్కువ పరుగులకే అవుటయిందని చెప్పాలి. ఇక రెండో ఇన్నింగ్స్ లో 364 పరుగులు మాత్రమే భారత్ జట్టు చేయగలిగింది. ఇంగ్లండ్ మాత్రం 373 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. నిజంగా ఇది బ్యాడ్ లక్ అనుకోవాలా? స్వయంకృతాపరాధమా? అన్నది చూసుకుని తదుపరి మ్యాచ్ కు టీం ఇండియా సిద్ధం కావాలి.