India vs South Africa : చెత్త బౌలింగ్.. అధమ ఫీల్డింగ్.. భారత్ ఘోర వైఫల్యం
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య రాయపూర్ లో జరిగిన రెండో వన్డే లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య రాయపూర్ లో జరిగిన రెండో వన్డే లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. భారత్ ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకుంది. ఫీల్డింగ్, బౌలింగ్ లో చెత్త ప్రదర్శన చేయడంతోనే ఈ ఓటమి దక్కింది. భారీ స్కోరు సాధించినా లాభం లేకపోయింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు నిర్దాక్షిణ్యంగా భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. మొదటి వన్డేలోనూ 349లో చచ్చీ చెడీ గెలిచిన టీం ఇండియా రెండో వన్డేకు వచ్చే సరికి చేతులెత్తేసింది. క్యాచ్ లను వదిలేయడం, వైడ్స్ వేయడంతో పాటు సిక్సర్లు, ఫోర్లు కొట్టేలా బౌలర్లు బౌలింగ్ చేయడం కూడా వెరసి దక్షిణాఫ్రికా విజయానికి కారణమని చెప్పాలి.
భారీ స్కోరు చేసినా...
భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్ సెంచరీలు, కేఎల్ రాహుల్ చేసిన అర్థ సెంచరీ కూడా దక్షిణాఫ్రికా విజయాన్ని ఆపలేకపోయింది. దక్సిణాఫ్రికా బ్యాటర్ల భాగస్వామ్యాన్ని విడదీయడంలో మన బౌలర్లు ఘోరంగా వైఫల్యం చెందారు. మార్ క్రమ్, బ్రెవిస్, బ్రిజ్కేలు నిలబడి తమ సత్తా ఏంటో భారత్ కు రుచి చూపించారు. యశస్వి జైశ్వాల్ సులువైన క్యాచ్ ను బౌండరీ లైన్ వద్ద వదిలేసి లైఫ్ ఇచ్చాడు. ఇలా అనేక తప్పిదాలు భారత్ ఓటమి కారణమయ్యాయి. దీంతో వన్డే సిరీస్ లో భారత్ దక్షిణాఫ్రికా 1-1 తో సమంగా ఉంది. విశాఖలో ఈ నెల 6వ తేదీన జరిగే మూడో వన్డే సిరీస్ ఎవరిదో తేల్చనుంది.
మరో నాలుగు బాల్స్ మిగిలి ఉండగానే...
భారత్ ఐదు వికెట్లకు భారీ లక్ష్యమే దక్షిణాఫ్రికా ముందు ఉంచింది. 358 పరగులు అంటే ఆషామాషీ కాదు. కానీ భారత్ ఫీల్డింగ్ కు వచ్చేసరికి అనేక తప్పిదాలు అందరికీ కనిపించాయి. తొలి వికెట్ భాగస్వామ్యాన్ని వెంటనే విడదీసినా తర్వాత మాత్రం దక్షిణాఫ్రికా బ్యాటర్ల భాగస్వామ్యాన్ని విడదీయడానికి తంటాలు పడ్డారు. మార్ క్రమ్ 110 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. డెవాల్ట్ బ్రెస్ యాభై నాలుగు పరుగులు, బ్రీజ్కే 68 పరుగులు చేసి దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలోనే తమ ముందు ఉంచిన లక్ష్యాన్నిఅధిగమించింది. జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యాలు లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపించింది. హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ చెత్త బౌలింగ్ భారత వైఫల్యానికి కారణమయింది.