రోజర్ బిన్నీ వచ్చాడు.. గంగూలీ ఏమన్నాడంటే..?

Update: 2022-10-19 02:22 GMT

భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. మంగళవారం జరిగిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్షుడి పదవికి నామినేషన్ వేసిన ఏకైక వ్యక్తి బిన్నీయే కావడంతో ఎన్నిక లాంఛనమే అయ్యింది. 2019 నుంచి బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన సౌరవ్ గంగూలీ స్థానంలో బిన్నీ బాధ్యతలు చేపట్టనున్నాడు. 67 ఏళ్ల వయసున్న రోజర్ బిన్నీ భారత్ తరపున 27 టెస్ట్ మ్యాచ్‌లు, 72 వన్డేలు ఆడాడాు. 1983 వరల్డ్ కప్ జట్టు సభ్యుడిగా రోజర్ బిన్ని టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన అనుభవం ఉంది. అంతేకాకుండా గతంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా కూడా సేవలు అందించాడు. బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో సౌరవ్ గంగూలీ, జైషా, రోజర్ బిన్నీ, అరుణ్ సింగ్ ధుమాల్, రాజీవ్ శుక్లా పాల్గొన్నారు.

రోజర్ బిన్నీ ఎంపికపై దాదా మాట్లాడుతూ.. 'కొత్త అధ్యక్షుడిగా ఎంపికైన బిన్నీకి శుభాకాంక్షలు. బిన్నీతో పాటు కొత్త పాలకవర్గానికి ఆల్ ది బెస్ట్. గత కొంతకాలంగా జైత్రయాత్ర సాగిస్తున్న టీమిండియా, బీసీసీఐ ప్రయాణం ఇలాగే సాగిపోయే దిశగా వాళ్లు కృషి చేయాలి. బీసీసీఐ సమర్థులైన నాయకుల చేతిలో ఉంది. రాబోయే కాలంలో భారత క్రికెట్ మరింత స్ట్రాంగ్ గా తయారవుతుంది..' అని తెలిపాడు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొడుకు జయ్ షా బీసీసీఐ (బీసీసీఐ) సెక్రటరీగా రెండవ దఫా కొనసాగనున్నాడు. మరోవైపు బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా తన పదవిని తిరిగిపొందాడు. ఐపీఎల్ చైర్మన్‌గా అరుణ్ ధుమాల్ పేరు ఖరారైంది.


Tags:    

Similar News