India Vs South Africa : ఇక అవతలకు బోయి ఆడుకోండి భయ్యా..ఓటమి అంచున భారత్
భారత్ - దక్షిణాఫ్రికా మధ్య గౌహతిలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఓటమి దిశగా పయనిస్తుంది
భారత్ - దక్షిణాఫ్రికా మధ్య గౌహతిలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఓటమి దిశగా పయనిస్తుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా 1-0 సిరీస్ లో ఆధిక్యతతో ఉంది. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే భారత్ తన సొంత గడ్డపై క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అసలు బ్యాటింగ్ లో ఇంత ఘోర వైఫ్యల్యం గతంలో ఎన్నడూ చూడలేదు. సీనియర్లు లేని జట్టు ఇలా బ్యాట్ ఎత్తేయడం చూస్తుంటే వారి అవసరం ఎంత ఉందో ఇప్పుడు అర్థమవుతుంది. యువ బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేక ప్రత్యర్థికి విజయాన్ని కట్టబెడుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లేని లోటు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
రెండు ఇన్నింగ్స్ లోనూ...
తొలి ఇన్నింగ్స్ లో బౌలర్లు చేతులెత్తేశారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లను అవుట్ చేయడానికి భారత బౌలర్లు తంటాలు పడ్డారు. తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా ను 489 పరుగులకు కాని ఆల్ అవుట్ చేయలేకపోయారు. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్ లో 201 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దీన్ని బట్టి మన బ్యాటర్లు, బౌలర్లు పనితనం చూపించలేకపోయారన్నది గణాంకాలు స్పష్టంగా చూపెడుతున్నాయి. ఇక రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 205 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయి తర్వాత డిక్లేర్ చేసింది. అయితే భారీ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. దక్షిణాఫ్రికా స్పిన్నర్ల ముందు భారత బ్యాటర్లు తలవంచి వరస పెట్టి క్రీజును వదిలి బయటకు వెళుతున్నారు.
ఈరోజు కీలకం...
ప్రస్తుతం నాలుగో రోజు ఆటముగిసే సమయానికి భారత్ 522 పరుగుల వెనకబడి ఉంది. ఐదో రోజు వికెట్లు పోకుండా నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. కానీ ఇరవై ఏడు పరుగులకే నాలుగో రోజు రెండు కీలకమైన వికెట్లను భారత్ కోల్పోయింది. యశస్విజైశ్వాల్, కేఎల్ రాహుల్ లు అవుటయ్యారు. యశస్వి జైశ్వాల్ పదమూడు పరుగులకే వెనుదిరగగా, కేఎల్ రాహుల్ ఆరు పరుగులకే అవుటయి భారత్ విజయావకాశాలపై నీళ్లు చల్లాడు. ప్రస్తుతం కులదీప్ యాదవ్ రెండు పరుగులతోనూ, సాయి సుదర్శన్ రెండు పరుగులతోనూ క్రీజులో ఉన్నాడు. ఓటమి నుంచి తప్పించుకోవాలంటే ఆఖరి రోజైన నేడు మొత్తం బ్యాటింగ్ చేయాలి. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యమనే అనిపిస్తుంది.