India vs South Africa T20 : సత్తా చూపాలని భారత్.. ప్రతీకారంతో దక్షిణాఫ్రికా.. పిచ్ రిపోర్ట్ ఇదే
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య రెండో టీ20 మ్యాచ్ నేడు ముల్తాన్ పూర్ లో జరగనుంది.
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య రెండో టీ20 మ్యాచ్ నేడు ముల్తాన్ పూర్ లో జరగనుంది. రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే కటక్ లో అద్భుతమైన విజయం సాధించిన టీం ఇండియా రెండో టీ20లోనూ సత్తా చూపించాలని తహతహలాడుతుంది. టెస్ట్ మ్యాచ్ లో వైట్ వాష్ గురైన భారత్ దక్షిణాఫ్రికాను వన్డే సిరీస్ లో ఓడించగలిగింది. ఇక టీ20 సిరీస్ ను కూడా కైవసం చేసుకోవాలని టీం ఇండియా పరితపిస్తుంది. ఇప్పటికే టీ20 సిరీస్ భారత్ 1-0 ఆధిక్యతతో కొనసాగుతుంది. కటక్ లో 101 పరుగుల భారీ స్కోరు తేడాతో సాధించిన విజయంతో ఊపు మీదున్న టీం ఇండియా ముల్తాన్ పూర్ లోనూ తమదే పైచేయి కొనసాగించాలని చూస్తుంది. ఫాస్ట్ బౌలర్ కు ముల్తాన్ పూర్ పిచ్ అనుకూలంగా ఉంటుందని, భారీ పరుగుల వచ్చే అవకాశముంది.
బలంగా భారత్...
టీం ఇండియా ఇప్పుడు బౌలింగ్, బ్యాటింగ్ లో బలంగా కనిపిస్తుంది. అభిషేక్ శర్మ దూకుడు, శుభమన్ గిల్ బలమైన ఆటతో శుభారంభాన్నిఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక సూర్యకుమార్ యాదవ్ చెప్పాల్సిన పనిలేదు. క్రీజులో ఉన్నంత వరకూ ప్రత్యర్థులకు భయమే.తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ మినిమం స్కోరు చేసే ఆటగాడిగా పేరుంది. ఆరడుగుల బుల్లెట్ శివమ్ దూబె బ్యాట్ తో చేసే విన్యాసానికి ప్రత్యర్థులకు చుక్కలే. ఇక హార్ధిక్ పాండ్యా రీ ఎంట్రీ తర్వాత టీం ఇండియా మరింతగా బలం పెరిగింది. అక్షర్ పటేల్, శివమ్ దూబె ఆల్ రౌండర్లుగా ప్రతిబ చూపుతున్నారు. దీంతో పాటు జితేశ్ శర్మ హిట్టింగ్ బ్యాటర్ గాపేరుంది. దీంతో ఎనిమిది మంది బలమైన బ్యాటర్లతో టీం ఇండియా బరిలోకి దిగనుంది.
దక్షిణాఫ్రికా కూడా బలంగానే...
జస్ప్రిత్ బుమ్రా టీ20లలోకి మళ్లీ వచ్చిన తర్వాత భారత్ బౌలింగ్ బలం మరింత పెరిగింది. కటక్ లో రెండు వికెట్లు తీశాడు. హార్ధిక్ పాండ్యా, అర్ష్ దీప్ సింగ్ ఖచ్చితంగా వికెట్లను తీయగల సమర్థులే. ఇక వరుణ్ చక్రవర్తి కామ్ గా వికెట్లు తీసుకుని వెళ్లిపోతాడు. అలాగని దక్షిణాఫ్రికాను తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు. తొలిటీ20లో ఓటమి పాలయి దక్షిణాఫ్రికా ప్రతీకారంతో రగిలిపోతుంది. ఆ జట్టులో ఏ ఇద్దరు నిలబడినా స్కోరును అవలీలగా చేజ్ చేయగల సమర్థత ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా కూడా బలంగా ఉన్న దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్ లో నెగ్గాలని కసితో దిగుతుంది. మరి చివరకు ముల్తాన్ పూర్ ఎవరిని వరిస్తుందన్నది మాత్రం చివరి ఓవర్ వరకూ తేలకపోవచ్చు.