India Vs South Africa : తేలిగ్గా తీసుకుంటే.. తన్నుకుపోతారంతే

భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య రెండో వన్డే మ్యాచ్ నేడు రాయపూర్ వేదికగా జరగనుంది.

Update: 2025-12-03 02:11 GMT

భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య రెండో వన్డే మ్యాచ్ నేడు రాయపూర్ వేదికగా జరగనుంది. రాంచీలోజరిగిన తొలి మ్యాచ్ లో విజయం సాధించిన ఉత్సాహంతో భారత్ ఉంది. ఈ మ్యాచ్ లో గెలిచి భారత్ వన్డే సిరీస్ ను కైవసం చేసుకోవాలన్న కసితో ఉంది. అయితే దక్షిణాఫ్రికాను అంత తేలిగ్గా అంచనా వేయలేం. ఎందుకంటే రాంచీలో జరిగిన ఆఖరి ఓవర్ వరకూ దక్షిణాఫ్రికా భయపెట్టింది. టీం ఇండియా 349 పరుగులు చేసినప్పటికీ దక్షిణాఫ్రికా జట్టు ఆడిన తీరును ఎవరైనా ప్రశంసించాల్సిందే. ఎందుకంటే ఇద్దరు బ్యాటర్ల మధ్య భాగస్వామ్యం అలా చెక్కు చెదరకుండా చాలా సేపు ఉంది. 11 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దక్షాణాఫ్రికా జట్టు చివరి ఓవర్ వరకూ విజయంపై ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు.

దక్షిణాఫ్రికా బలంగా...
అందుకే దక్షిణాఫ్రికాను అంత సులువుగా అంచనా వేయడానికి వీలులేదు. కులదీప్ యాదవ్ సరైన సమయంలో భాగస్వామ్యాన్ని విడదీయకపోయి ఉంటే రాంచీ మ్యాచ్ మన నుంచి చేజారి పోయి ఉండేది. అందుకే దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లో బలంగా ఉందన్నది అందరూ అంగీకరించాల్సిందే. చివరి వికెట్ వరకూ వారు పోరాడి ఆడిన తీరు అద్భుతం. మరొక నాలుగు పరుగులు మాత్రమే మిగిలి ఉండగానే భారత్ కు విజయం లభించిందంటే దక్షిణాఫ్రికా జట్టు సత్తాను తక్కువగా అంచనా వేయడం తెలివిలేని పని అవుతుంది. అదే మన బ్యాటింగ్ ను తీసుకుంటే కొంత నిరాశపడక తప్పడం లేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ లు మాత్రమే ఆడగలిగారు.
బ్యాటర్లు రాణించగలిగితేనే.. భాగస్వామ్యం ఎక్కువగా...
మిగిలిన ఆటగాళ్లు త్వర త్వరగా అవుటయ్యారు. అందుకే భారత జట్టు మైదానంలో బ్యాటుతోనూ, బంతితోనూ రాణించగలిగితేనే రెండో వన్డే రాయపూర్ లో మనదవుతుంది. బ్యాటర్ల మధ్య భాగస్వామ్యం కూడా ఎక్కువగా ఉండాలి. అంతే తప్ప సొంత మైదానం అని మనదే విజయం అని భావిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని క్రీడానిపుణులు చెబుతున్నారు. భారత్ కు గుడ్ న్యూస్ ఏంటంటే.. రోహిత్, కోహ్లిలు ఫామ్ లోకి రావడమే. యశస్వి జైశ్వాల్ దూకుడుగా ఆడుతూ వికెట్లను త్వరగా సమర్పించుకోవడం కూడా కలవరపెట్టే అంశమే. ఇక రెండో వన్డేలో కొన్ని మార్పులతో జట్టు దిగే అవకాశముంది. రిషబ్ పంత్ కు ఈజట్లులో అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తిలక్ వర్మ, నితీష్ రెడ్డిలను ఈ జట్టు నుంచి తప్పించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.


Tags:    

Similar News