IPL 2025 : అదర గొట్టిన బెంగళూరు.. మళ్లీ తలవొంచిన రాయల్స్
బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రాజస్థాన్ రాయల్స్ పై విజయం సాధించింది.
ఐపీఎల్ సీజన్ 18లో మాత్రం మళ్లీ అంచనాలు అందుకున్న జట్లు అభిమానుల ప్రశంసలతో పాటు మార్కుల విషయంలో కూడా ముందుకు దూసుకు వస్తున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ట్రోఫి అనేది అందని ద్రాక్షగానే మిగిలింది. ఐపీఎల్ టీంలలో చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు ధీటుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఫ్యాన్స్ అధికంగా ఉన్నారు. అందుకు కారణం చెన్నైలో ధోని ఉంటే, బెంగళూరులో కోహ్లి ఉండటమే కారణమని వేరే చెప్పాల్సిన పనిలేదు. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీని అందుకోవడానికి ఆవల దూరంలోనే నిలబడాల్సి ఉంటుంది. నిన్న బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రాజస్థాన్ రాయల్స్ పై విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ కు దిగి...
తొలుత టాస్ గెలుచుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఓపెనర్లు సాల్ట్, కోహ్లిలు ఇద్దరూ అదరగొట్టేశారు. సాల్ట్ వెనువెంటనే అవుటయినప్పటికీ కోహ్లీ నిలకడగా ఆడటంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు సాధించింది.సాల్ట్ 26 పరుగులకు అవుటవ్వగా అతడి స్థానంలో వచ్చిన పడిక్కల్ కూడా అంతే విజృంభించి ఆడాడు. కోహ్లి తన బ్యాట్ ను ఝుళిపించడంతో 70 పరుగులు చేశాడు. పడిక్కల్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని వెనుదిరిగాడు. జితేశ్ శర్మ ఇరవై, టిమ్ డేవిడ్ 23 పరుగులు చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మొత్తం ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ జట్టులో సందీప్ శర్మ రెండు, హసరంగ, ఆర్చర్ తలో వికెట్ తీయగలిగారు.
లక్ష్యం పెద్దదయినా...
అయితే రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ లో పెద్దగా కలసి రావడం లేదు. విజయాలు తక్కువ.. ఓటములు ఎక్కువగా సాగుతుంది. రాయల్స్ జట్టు ఎందుకో ఈ సీజన్ లో అంచనాలను అందుకోలేకపోతుంది. అనుకున్నట్లుగానే 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టులో యశస్వి జైశ్వాల్ ఓపెనర్ గా వచ్చి 49 పరుగులు చేశాడు. సూర్యవంశీ వైభవ్ పదహారు పరుగులకే పరిమితమయ్యాడు. నితీశ్ రాణా 28, పరాగ్ 22, జురెల్ 47 , హెట్ మేయర్ 11, శుభమ్ దూబెపన్నెండు పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 194 పరుగులు మాత్రమే చేయగలిగింది. పదకొండు పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది.