IPL 2025 : ప్లేఆఫ్ కు చేరువలో బెంగళూరు... ఢిల్లీపై కసి తీర్చుకున్న ఛాలెంజర్స్

ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఢిల్లీ కాపిటల్స్ పై విజయం సాధించింది.

Update: 2025-04-28 02:02 GMT

ఈ ఐపీఎల్ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పడుతూ.. లేస్తూ వస్తున్నా మొత్తానికి ప్లేఆఫ్ కు చేరువలోకి వచ్చింది. ఇప్పటికే పథ్నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఏడు విజయాలను సొంతం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఇక ప్లేఆఫ్ లో చోటు సంపాదించుకునేందుకు పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే మిగిలిన జట్ల కంటే పాయింట్లలోనూ, రన్ రేట్ లోనూ మెరుగ్గా ఉండటమే దీనికి కారణం. సొంత గడ్డ బెంగళూరుపై తమను ఓడించామన్న కసితో రగిలిపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చివరకు దాని సొంత మైదానమైన ఢిల్లీలోనే ఢిల్లీ కాపిటల్స్ జట్టును మట్టికరిపించి రివెంజ్ తీర్చుకున్నట్లయింది. విరాట్ కోహ్లి తాను చిన్నప్పటి నుంచి ఆడిన మైదానంలో మరోసారి బ్యాట్ ఝులిపించాడు. అర్ధ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఢిల్లీ కాపిటల్స్ పై విజయం సాధించింది.

నిరాశపర్చిన ఢిల్లీ...
టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ కాపిటల్స్ జట్టు లో అభిషేక్ పోరెల్ 28 పరుగులు, డుప్లెసిస్ 22 పరుగులు చేశారు. కరుణ్ నాయర్ నాలుగు పరుగులకే వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ కూడా తనదైన ఇన్నింగ్స్ ఆడి 41 పరుగుల చేశాడు. ఈ సీజన్ లో కేఎల్ రాహుల్ నిలకడగా రాణిస్తూ మినిమం స్కోరును జట్టు ఖాతాలో వేస్తున్నాడు. స్టబ్స్ కూడా అదరగొట్టడంతో 34 పరుగుల చేసిఅవుటయ్యాడు. తర్వాత వచ్చిన బ్యాటర్లు అందరూ ఎవరూ నిలబడలేకపోవడంతో ఢిల్లీ కాపిటల్స్ జట్టు మొత్తం ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి కేవలం 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ విజృంభించి మూడు వికెట్లు తీశాడు. యశ్ దయాళ్ ఒకటి, హేజిల్ వుడ్ రెండు, కృనాల్ పాండ్యా ఒక వికెట్ తీయడంతో ఢిల్లీ ఇన్నింగ్స్ తక్కువ స్కోరుకే ముగిసింది.
తక్కువ స్కోరు అయినా...
తక్కువ స్కోరు అయినా ఢిల్లీ మైదానంలో ఆ మాత్రం స్కోరు సాధించడం అంటే మామూలు విషయం కాదన్న సంగతి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కు తెలియంది కాదు. అందుకే ఆచి తూచి ఆట ప్రారంభించింది. అయినా బెతెల్ పన్నెండు పరుగులు చేసి అవుటయ్యాడు. కోహ్లీ మాత్రం నిలబడి ఆడుతూ జట్టుకు యాభై ఒక్క పరుగులు సాధించిపెట్టాడు. పడిక్కల్ డకౌట్ అయినా పాటీదార్ కూడా ఆరు పరుగులతో నిరాశపర్చాడు. కృనాల్ పాండ్యా మాత్రం ఈ ఆటలో ఒక్కసారిగా దూసుకు వచ్చి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును గెలిపించాడు. కృనాల్ పాండ్యా 74 పరుగులు చేయడంతో విజయం సాధ్యమయింది. 18.3 ఓవర్లలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అనుకున్న లక్ష్యాన్ని సాధించినట్లయింది. ఇంకా ఒకటిన్నర ఓవర్ మిగిలి ఉండగానే మరో విజయాన్ని అందుకుని ప్లేఆఫ్ రేసులో ముందుకు వచ్చింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఢిల్లీపై పగ తీర్చుకున్నట్లయింది.
Tags:    

Similar News