రోకోలకు ఇంతటి అవమానమా...? ఆగ్రహిస్తున్న ఫ్యాన్స్
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల పట్ల బీసీసీఐ సెలక్షన్ కమిటీ అవమానకరంగా వ్యవహరించిందన్న కామెంట్స్ క్రికెట్ ఫ్యాన్స్ నుంచి వినపడుతున్నాయి.
టీం ఇండియాను కొన్ని దశాబ్దాల పాటు విజయం వైపు నడిపించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల పట్ల బీసీసీఐ సెలక్షన్ కమిటీ అవమానకరంగా వ్యవహరించిందన్న కామెంట్స్ క్రికెట్ ఫ్యాన్స్ నుంచి వినపడుతున్నాయి. ఇన్నాళ్లూ దేశానికి చేసిన సేవకు ఇదా గుర్తింపు అని నెట్టింట అనేక మంది ప్రశ్నిస్తున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ఎన్నో సార్లు టీం ఇండియాను ఆదుకున్నారు. అనేక ట్రోఫీలను సాధించి పెట్టారు. రికార్డులతో పాటు రివార్డులు కూడా సాధించిపెట్టారు. అలాంటి ఇద్దరికి సెలెక్టర్లు వార్నింగ్ లు ఇవ్వడమేంటన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. సీనియర్ ఆటగాళ్లకు ఇచ్చే విలువ ఇదేనా అని కొందరు సెలక్షన్ కమిటీని ఏకిపారేస్తున్నారు.
వన్డే కెప్టెన్సీ నుంచి...
వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొలగించారు. ఆ కెప్టెన్సీ బాధ్యతను శుభమన్ గిల్ కు అప్పగించారు. కొద్ది నెలల క్రితమే రోహిత్ శర్మ నేతృత్వంలో ఛాంపియన్ ట్రోఫీని సాధించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇంతోటి దానికి అసలు ఆటగాళ్లుగా అయినా ఎంపిక చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. బీసీసీఐ కేవలం కాసులు సంపాదించుకుని, వేల కోట్ల రూపాయలు కూడబెట్టుకునే రిజర్వ్ బ్యాంకు కాదని, సీనియర్ ఆటగాళ్ల సేవలను కూడా గుర్తుంచుకుని వారికి అవమానం లేకుండా వ్యవహరించడం విజ్ఞతతో కూడిన వ్యవహారం అని అంటున్నారు. ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు టీ 20, టెస్ట్ మ్యాచ్ ల నుంచి రిటైర్ అయ్యారు. వారిద్దరూ కనిపించేది ఇక వన్డేల్లో మాత్రమే.
దేశవాళీ క్రికెట్ ఆడితేనే...
అంతేకాకుండా దేశవాళీ క్రికెట్ ఆడితేనే అవకాశం కల్పిస్తామంటూ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలు ఇద్దరి అభిమానులకు మంట పుట్టిస్తున్నాయి.ఇప్పటికీ ఎక్కడ ఏ మ్యాచ్ జరిగినా ఈ ఇద్దరి పేర్లు స్టేడియంలో అభిమానుల నోటి నుంచి వస్తాయి. వారు భారత్ కు దక్కించిన అనేక విజయాలను గుర్తు చేసుకోవడమే కాకుండా మైదానంలో వారి పేర్లతో నినాదాలు చేస్తున్నారంటే వారికి అభిమానులు ఎంత గౌరవమిస్తున్నారో తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. ఆసియా కప్ లో పాక్ తో ఆడిన మ్యాచ్ లో సయితం కోహ్లి.. కోహ్లి... అనే నినాదాలు మిన్నంటాయి.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ఇప్పటికీ వారి సక్సెస్ రేట్ ను ఎవరూప కాదనలేరు. కానీ ఆ ఇద్దరి అభిమానుల హార్ట్ బ్రేక్ చేస్తూ బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఆడామని కాదు.. ఎప్పటికైనా ఎవరి పరిస్థితి అయినా ఇంతేనా? అన్నట్లు వ్యవహరించడం సరికాదంటున్నారు. బీసీసీఐ కొన్ని సెంటిమెంట్లకు కూడా కట్టుబడి ఉండాలన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.