రోహిత్, కొహ్లిలను మర్చిపోయేటట్లు చేస్తున్నారుగా...వీళ్ల దూకుడేంది సామీ
టీం ఇండియా లో సీనియర్లు లేని లోటు అనేది ఇప్పుడు కనిపించడం లేదు. రోహిత్ శర్మ, విరాట్ కొహ్లి వంటి వారి పేర్లు ఇప్పుడు కనుమరుగయిపోతున్నాయి
టీం ఇండియా లో సీనియర్లు లేని లోటు అనేది ఇప్పుడు కనిపించడం లేదు. రోహిత్ శర్మ, విరాట్ కొహ్లి వంటి వారి పేర్లు ఇప్పుడు కనుమరుగయిపోతున్నాయి. ఒకప్పుడు విరాట్ కొహ్లి, రోహిత్ శర్మ వంటి వాళ్లు క్రీజులో ఉంటే భరోసా ఉండేది. ఇప్పుడు వారు లేకపోయినా ఆసియా కప్ లో ఓటమి లేకుండా అన్ని మ్యాచ్ లు గెలుపొందడంతో వారిని క్రికెట్ ఫ్యాన్స్ త్వరగా మర్చిపోయేలా చేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఆసియా కప్ ప్రారంభం కాకముందు.. రోహిత్ శర్మ, విరాట్ కొహ్లిని తలచుకోని భారత్ క్రికెట్ అభిమానులు లేరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇప్పటి వరకూ వారి ఆట చూసిన వారు టీ20లలో వారు మైదానంలో బ్యాట్ ను ఝులిపించే తీరును చూసి అందరూ ఆశ్చర్య పోయారు.
ఆసియా కప్ లో ఆటతీరును చూసి...
కానీ ఇటీవల ఆసియా కప్ చూసిన తర్వాత క్రికెట్ ఫ్యాన్స్ మైండ్ లో నుంచి వారిద్దరి పేర్లు చెరిగిపోయాయని చెప్పాలి. ఇప్పుడంతా అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, తిలక్ వర్మ, శివమ్ దూబె వంటి పేర్లు మార్మోగిపోతున్నాయి. నిజానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు దేశానికి అందించిన సేవలు ఎన్నటికీ మర్చిపోలేం. అనేక మ్యాచ్ లలో టీం ఇండియా విజయం సాధించడానికి ఈ ఇద్దరు కారణమని చెప్పక తప్పదు. అలాంటి వారిద్దరూ టీ 20లకు గుడ్ బై చెప్పారు. వారు రిటైర్ మెంట్ ప్రకటించిన రోజు భారత్ ఫ్యాన్స్ మన పరిస్థితి ఏంటని ఆలోచించిన వారు అత్యధిక మంది ఉన్నారు. కొత్త కుర్రోళ్లు తమ అనుభవ లేమితో మ్యాచ్ లను ప్రత్యర్థులకు అప్పగిచ్చేస్తారా? అన్న అనుమానం కూడా అందరిలోనూ కలిగింది.
మ్యాచ్ లు చూసిన తర్వాత...
కానీ ఆ అనుమానాలన్నీ పటా పంచలయ్యాయి. ఆసియా కప్ తో పాటు ఇటీవల జరిగిన వన్డే మ్యాచ్ లు చూసిన తర్వాత మనకు సీనియర్లు లేని లోటు కనిపించడం లేదు. వన్డేల్లోనూ, టీ 20లలోనూ సూపర్ హీరోలు టీం ఇండియా జట్టులోకి వచ్చి చేరుతున్నారు. చిచ్చర పిడుగుల్లా రెచ్చిపోతూ ప్రత్యర్థులను చిత్తుగా ఓడిస్తున్నారు. అందుకే రోహిత్ శర్మ, విరాట్ కొహ్లి వంటి వారిని క్రికెట్ ఫ్యాన్స్ త్వరగా మర్చిపోయారు. కానీ నిన్న ఆసియాకప్ లో మ్యాచ్ చూసిన వారు తిలక్ వర్మను చూసిన తర్వాత మరో కొహ్లి మనకు దొరికాడోచ్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక అభిషేక్ శర్మ దూకుడు చూసిన తర్వాత కూడా అదే అభిప్రాయం కలుగుతుంది. సో... డోన్ట్ వర్రీ.. బీ హ్యాపీ.. మనకు ఎదురులేదు.. తిరుగులేదన్న మాట.