బీసీసీఐ అధికారులను పీసీబీ ఎలా చూసుకుందంటే?

బీసీసీఐ అధికారులు ఆసియా కప్ ప్రారంభోత్సవం కోసం పాకిస్థాన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే

Update: 2023-09-07 13:31 GMT

బీసీసీఐ అధికారులు ఆసియా కప్ ప్రారంభోత్సవం కోసం పాకిస్థాన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే..! భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు రోజర్ బిన్నీ సెప్టెంబరు 4న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇచ్చిన విందులో పాల్గొన్నారు. బిన్నీ భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత PCB ఆతిథ్యం గురించి గొప్పగా చెప్పారు. పాకిస్తాన్‌లో తమను రాజులలా చూసుకున్నారని అన్నారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా డిన్నర్ పార్టీకి హాజరయ్యేందుకు వాఘా సరిహద్దు నుండి పాక్ కు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో బిన్నీ ప్రసంగించారు. క్రికెట్‌లో పాకిస్తాన్‌తో భారత్ తలపడినప్పుడు.. ప్రతిదీ నిలిచిపోతుందని చెప్పారు. "ప్రజలు పని చేయడం మానేస్తారు, రోడ్లు ఖాళీగా ఉంటాయి. అందరూ టెలివిజన్ ముందు క్రికెట్ చూస్తూ ఉండిపోతారు. భారతదేశం, పాకిస్తాన్‌లలో క్రికెట్ చాలా పెద్ద అంశం, ”అని రోజర్ బిన్నీ అన్నారు.

చిరకాల ప్రత్యర్థులుగా పేరుపొందిన భారత్, పాకిస్థాన్ జట్లు ద్వైపాక్షిక సిరీస్ ల్లో పాల్గొని 15 సంవత్సరాలకు పైగా కాలం గడచిపోయింది. ఐసీసీ ప్రపంచ టోర్నీలతో పాటు ఆసియా క్రికట్ మండలి నిర్వహించే టోర్నీలలో మాత్రమే ముఖాముఖీ తలపడుతున్నాయి. బిన్నీ ANIతో మాట్లాడుతూ.. అద్భుతమైన అనుభవం అని.. తన పర్యటనలో పాక్ అధికారులందరినీ కలిశానని అన్నారు. "ఇది అద్భుతమైన అనుభవం. మేము 1984లో టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు కూడా మాకు అదే ఆతిథ్యం ఇచ్చారు. అక్కడ మమ్మల్ని రాజుల్లా చూసుకున్నారు. మేము పాకిస్తాన్ అధికారులందరినీ కలవగలిగాము. మేము అక్కడకు రావడం చాలా సంతోషంగా ఉందని పీసీబీ అధికారులు తెలిపారు" అని బిన్నీ తెలిపారు. రోజర్ బిన్నీ, రాజీవ్ శుక్లా మూడు రోజుల పాటు లాహోర్ లో పర్యటించి వచ్చారు.


Tags:    

Similar News