IPL 2025 : ఉప్పల్ ఊదిపారేసిన ముంబయి ఇండియన్స్.. తేలిపోయిన సన్ రైజర్స్

హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ పై సూపర్ విక్టరీని సాధించింది

Update: 2025-04-24 01:38 GMT

ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ జట్టు క్రమంగా పట్టు బిగిస్తుంది. ఉప్పల్ మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం తేలిపోతుంది. ఆరంభంలో తడబడిన ముంబయి ఇండియన్స్ జట్టు తేరుకుని విజయాల బాట పట్టి వరసగా నాలుగో విజయాన్ని అందుకుంది. అదే సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఆరంభంలో అదరగొట్టి తర్వాత ఏమయిందో ఏమో ఆ జట్టుకు విజయం అనే మాట తెలియకుండా పోయింది. తమకు అచ్చి వచ్చిన హైదరాబాద్ లోని ఉప్పల్ మైదానంలోనూ సన్ రైజర్స్ చేతుతెత్తేసింది. నిన్న హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ పై సూపర్ విక్టరీని సాధించింది. మామూలుగా కాదు. సన్ రైజర్స్ ఇప్పటికి చెన్నై సరసన పాయింట్ల పట్టికలో అట్టడుగుకు చేరింది.

ఎవరూ నిలబడలేక...
టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ తొలుత ఫీల్డింగ్ ను ఎంచుకుంది. తమకు కలసి వచ్చిన మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు చేస్తుందని భావించారు. కానీ ఏ ఒక్క బ్యాటరూ ముంబయి బౌలర్ల ముందు నిలవలేకపోయారు. హెడ్ డకౌట్ కాగా, అభిషేక్ శర్మ ఎనిమిది పరుగులకు అవుటయ్యాడు. ఇషాన్ కిషన్ ఒక పరుగు చేసి వెనుదిరిగాడు. నితీష్ రెడ్డి రెండు పరుగులు చేసి చాలు అని వెళ్లిపోయాడు. క్లాసెన్ ఒక్కడే నిలిచి ఆడాడు. క్లాసెన్ 71 పరుగులు చేయడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ కు గౌరవ ప్రదమైన స్కోరు లభించింది. అనికేత్ పన్నెండ్, అభినవ్ మనోహర్ 43 పరుగులు చేయడంతో మొత్తం ఇరవై ఓవర్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి కేవలం 143 పరుగులు మాత్రమే చేయగలిగింది.
పెద్ద లక్ష్యమేమీ కాకపోవడంతో...
ఇక ముంబయి ఇండియన్స్ కు ఈ స్కోరు పెద్ద లక్ష్యమేమీ కాదు. 143 స్కోరు అంటే ఊదిపారేస్తారని ఊహించిందే. అనుకున్నట్లుగానే ముంబయి ఇండియన్స్ జట్టు పెద్దగా కష్టపడకుండానే సన్ రైజర్స్ హైదరాబాద్ విషయంలో ఏ మాత్రం టెన్షన్ పడకుండానే తన ముందున్న లక్ష్యాన్ని ఛేదించింది. రికిల్ టన్ పదకొండు పరుగులు చేసి వెనుదిరిగినా, రోహిత్ శర్మ ఫామ్ లోకి రావడంతో తిరిగి ఈ మ్యాచ్ లోనూ 71 పరుగులు చేయడంతో ఇక ముంబయి ఇండియన్స్ కు తిరుగు లేకుండా ముందుకు వెళ్లింది. జాక్స్ 22, సూర్యకుమార్ నలభై పరుగులు చేయడంతో ముంబయి ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై విజయం సాధించింది. ముంబయి ఇండియన్స్ 15.4 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది.

















Tags:    

Similar News