IPL 2025 : పడి లేచినట్లుగా కోల్ కత్తా.. లేచి పడినట్లుగా ఢిల్లీ..?

ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ ఢిల్లీ కాపిటల్స్ పై విజయం సాధించింది

Update: 2025-04-30 02:36 GMT

ఐపీఎల్ లో చివరి సమయానికి వచ్చేసరికి అంతా మ్యాజిక్ జరుగుతుంది. ఇప్పటి వరకూ పేలవ ప్రదర్శన చేసిన జట్లు తిరిగి పుంజుకుంటున్నాయి. నిన్న రాజస్థాన్ రాయల్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ మీద గెలిచి సంచలనం సృష్టించగా నేడు కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు ఢిల్లీ కాపిటల్స్ పై విజయం సాధించడం కూడా అదే కోవలోకి చెందిందే. ఇప్పటి వరకూ ఢిల్లీ కాపిటల్స్ జట్టు వరస విజయాలతో ప్లేఆఫ్ రేసులోకి దూసుకు వస్తుందనుకుంటున్న తరుణంలో వరస ఓటములు దానిని ఇబ్బంది పెడుతున్నాయి. కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు ఈ మ్యాచ్ లో విజయం సాధించడంతో ప్లే ఆఫ్ రేసుపై ఆశలను సజీవంగా నిలుపుకున్నట్లయింది. అంటే చివరకు ప్లే ఆఫ్ కు ఏ జట్లు వస్తాయన్నది కూడా తేలకుండా ఉంది.

ముందుగా బ్యాటింగ్ కు దిగి...
నిన్న ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ ఢిల్లీ కాపిటల్స్ పై విజయం సాధించింది. టాస్ గెలిచిన ఢిల్లీ కాపిటల్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టులో గుర్బాజ్ 26 పరుగులు చేసి అవుటవ్వగా నరైన్ 27 పరుగులు చేసి వెనుదిరిగాడు. రహానే కూడా దూకూడుగా ఆడి 27 పరుగులు చేశాడు. రఘువంశీ సరైన సమయంలో బంతిని బౌండరీలకు, సిక్సర్లకు పరుగులు తీయించి 44 పరుగులు చేసి అవుటయ్యాడు. వెంకటేశ్ అయ్యర్ ఏడు పరుగులు చేసి నిరాశకు గురి చేశాడు. తర్వాత వచ్చిన రింకూ సింగ్ 36 పరుగులు చేయడంతో పాటు రస్సె నాటౌట్ 17 పరుగులు చేయడంతో కోల్ కత్తా నైట్ రైడర్స్ మొత్తం ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసి ఢిల్లీ కాపిటల్స్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.
భారీ లక్ష్యంతో...
ఐపీఎల్ లో 200 దాటడం అంటే భారీ లక్ష్యమే. దానిని అధిగమించాలంటే తొలి నుంచి దూకుడుగా ఆడాల్సి ఉంటుంది. ఢిల్లీ కాపిటల్స్ జట్టులో అభిషేక్ పోరెల్ నాలుగు, డుప్లెసిస్ 62 పరుగులు చేశారు. కరుణ్ నాయర్ 15 పరుగులు చేశాడు. రాహుల్ ఏడు పరుగులు చేసి రనౌట్ అయి వెనుదిరిగాడు. అక్షర్ పటేల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 43 పరుగులు చేశాడు. స్టబ్స్ కూడా వచ్చి అలా వెళ్లిపోయాడు. విప్రాజ్ మంచి ఇన్నింగ్స్ ఆడి 38 పరుగులు చేశాడు. అయితే ఎవరూ పెద్దగా చివరలో నిలబడి ఆడలేకపోవడంతో ఢిల్లీ కాపిటల్స్ జట్టు ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. నరైన్ మూడు వికెట్లు తీసి కోల్ కత్తాకు విజయాన్ని, ఢిల్లీకి పరాజయానికి కారణమయ్యాడు.


Tags:    

Similar News