India vs Newzealand : న్యూజిలాండ్ పై వన్డే సిరీస్ పై చేతులెత్తేసిన భారత్
న్యూజిలాండ్ పై భారత్ వన్డే సిరీస్ ను కోల్పోయింది.
న్యూజిలాండ్ పై భారత్ వన్డే సిరీస్ ను కోల్పోయింది. విరాట్ కోహ్లి ఒంటరి పోరు విజయాన్ని తెచ్చిపెట్టలేకపోయింది. 41 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఇండోర్ లో భారత్ పై ఘన విజయం సాధించింది. ఇండోర్ లో ఇప్పటి వరకూ ఓటమి ఎరుగని భారత్ కు తొలిసారి అపజయం ఎదురయింది. చెత్త బౌలింగ్, చెత్త బ్యాటింగ్.. అంతే చెత్తగా ఫీల్డింగ్ భారత్ ఓటమికి గల కారణాలని మ్యాచ్ చూసిన వారికి ఎవరికైనా అర్థమవుతుంది. సిరీస్ ను గెలుచుకునే మ్యాచ్ లో కూడా భారత్ బ్యాటర్లు చేతులెత్తేశారు. బౌలింగ్ లో పస లేదు. ఫీల్డింగ్ లో చేసిన తప్పిదాలు న్యూజిలాండ్ కు వరంగా మారాయి. దీంతో మూడో వన్డేలో భారత్‌పై న్యూజిలాండ్ 41 పరుగుల విజయం సాధించింది. సిరీస్ ను గెలుచుకుంది.
పసలేని బౌలింగ్...
తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ను భారత్ ఎంచుకుంది. వెంట వెంటనే రెండు న్యూజిలాండ్ కీలక వికెట్లు పడిపోయినా తర్వాత నాలుగో వికెట్ ను తీయడం మాత్రం భారత్ బౌలర్లకు సాధ్యం కాలేదు. యాభై ఓవర్ల మ్యాచ్ లో ఎనిమిది వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ 337 పరుగులు చేసింది. భారీ పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందుంచుంది. మిచెల్, ఫిలిప్స్ మరోసారి శతకాలు బాదారు. వారి భాగస్వామ్యం విడదీయడానికి భారత్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తొలి దశలో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించినా న్యూజిలాండ్ బ్యాటర్లు మిచెల్, ఫిలిప్స్ నిలబడి ఆడి చూపించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్‌కు డారిల్ మిచెల్ 137, గ్లెన్ ఫిలిప్స్ 106 శతకాలతో చెలరేగారు. ఇద్దరి భాగస్వామ్యం భారత్ బౌలర్లపై ఒత్తిడి తెచ్చింది. భారత బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ 3, హర్షిత్ రాణా 3 వికెట్లు తీశారు.
కోహ్లి ఒంటరి పోరాటం...
337 లక్ష్యంతో దిగిన భారత్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 337 పరుగులు చేయగా, లక్ష్య చేధనలో భారత్ ఆరంభంలోనే తడబడింది. 71 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అక్కడి నుంచి కోహ్లీ పోరాట పర్వం నడిపినా, మిగతా బ్యాటింగ్ నుంచి అవసరమైన మద్దతు పూర్తిగా రాలేదు. నితీష్ కుమార్ రెడ్డి 53, హర్షిత్ రాణా 52 పరుగులతో నిలిచినా జట్టు గెలుపు దరి చేరలేదు. భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకే ఆలౌట్ అయింది.మిచెల్, ఫిలిప్స్ శతకాలు కివీస్‌కు బలంగా నిలిచాయి. విరాట్ కోహ్లీ 108 బంతుల్లో 124 పరుగులతో రికార్డు స్థాయి 54వ వన్డే శతకం సాధించినా ఫలితం మారలేదు. మూడో, చివరి వన్డేలో న్యూజిలాండ్ 41 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మరోసారి సొంతగడ్డ మీద సిరీస్ ను సమర్పించుకుంది.