IPL 2024 : రెడీ అయిపోండి.. మజా చేసేయండి.. ప్రతి రోజూ పండగే ఇక

ఐపీఎల్ సీజన్ పది రోజుల్లో ప్రారంభం కానుంది. ఐపీఎల్ 17వ సీజన్ ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది

Update: 2024-03-12 07:36 GMT

ఐపీఎల్ సీజన్ పది రోజుల్లో ప్రారంభం కానుంది. ఐపీఎల్ 17వ సీజన్ ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. ఐపీఎల్ సీజన్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ కళ్లలో వత్తులేసుకుని మరీ ఎదురు చూస్తుంటారు. క్రికెట్ లో అసలైన మజాను ఆస్వాదించడానికి ఇందులోనే సాధ్యం. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా ఒక్కటేమిటి అన్ని రంగాల్లో రికార్డు మోత మోగుతాయి. చివరకు అంపైరింగ్ విషయంలో కూడా ట్రోల్స్ ఎక్కువగా వినిపిస్తాయి. ఒక్కటేమిటి.. అన్ని దేశాల ఆటగాళ్లను చూడవచ్చు. ఈ నెల 22వ తేదీన మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వం వహించే చెన్నై సూపర్ కింగ్స్ తో విరాట్ కొహ్లి ఉన్న జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.

ఈ నెల 22వ తేదీ నుంచి...
మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ సీజన్ 17 ప్రారంభం కానుంది. పది జట్లు ఇరవై ఓవర్ల పరిమిత మ్యాచ్ లో పసందైన విందును అందచేయనున్నాయి. ఐపీఎల్ నుంచే అనేక మంది ఆటగాళ్లు బాహ్య ప్రపంచానికి తెలిశారనడంలో సందేహం లేదు. సీనియర్ ఆటగాళ్లను పక్కన పెడితే కుర్రోళ్లు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకునేలోగా ఇండియన్ టీం లో మెంబర్ అయిపోతున్నారు. అలా అనేక మంది ఆటగాళ్లకు ఐపీఎల్ క్రీడాబిక్ష పెట్టిందనే చెప్పాల్సి ఉంటుంది. ఐపీఎల్ లో సక్సెస్ అయితే చాలు ఇక టీం ఇండియాలో చోటు దక్కినట్లే.
వీళ్లంతా వాళ్లేగా...
యశస్వి జైశ్వాల్, సర్ఫరాజ్ ఖాన్, శుభమన్ గిల్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో ఐపీఎల్ నుంచి వచ్చి టీం ఇండియాలో చోటు దక్కించుకున్న వారే. అలా గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ఆటగాళ్లు వచ్చి టీం ఇండియా క్యాప్ ను సంపాదిస్తున్నారంటే అది ఐపీఎల్ పుణ్యమే. అందుకే సీనియర్ ఆటగాళ్లకు ఫ్యాన్స్ ఉన్నప్పటీకీ, యువ ఆటగాళ్ల ఆటతీరును ఇందులోనే చూడాల్సి ఉంటుంది. వారు పడే కష్టం ఇందులోనే కనపడుతుంది. బ్యాటింగ్ పరంగా ఎందరో యువ ఆటగాళ్లు ఐపీఎల్ లో రికార్డులు తిరగరాశారు.
ఆల్ రౌండర్లకు...
బౌలర్లు అంతే.. కొత్త కొత్త బౌలర్లు.. ఈ ఐపీఎల్ నుంచి వచ్చిన వారు అనేక మంది టీం ఇండియాలో స్థానం దక్కించుకున్నారు. ఆల్ రౌండర్ గా ప్రతిభను చూపిన వారిని కూడా బీసీసీఐ సెలక్షన్ కమిటీ తన జాబితాలో చోటు కల్పిస్తుంది. అందుకే కొన్ని నెలల పాటు జరిగే ఈ ఐపీఎల్ సీజన్ కోసం దేశం మొత్తం కాదు.. యావత్ ప్రపంచంలో క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన మహేంద్ర సింగ్ ధోనిని చూడొచ్చు. టీం ఇండియాలో తన స్థానం కోల్పోయిన శిఖర్ ధావన్ ను కూడా మైదానంలో చూసే అవకాశముంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలు. ఫోర్లు.. సిక్సర్లు.. క్యాచ్‌లు.. స్టంపింగ్‌లు...రన్ అవుట్‌లు ఇలా అంతా కనులకు విందైన ఫీస్ట్. మీరు రెడీనా?


Tags:    

Similar News