India Vs England Fourth Test : నాలుగో టెస్ట్ లోనూ భారత్ తడబాటు.. భారీ స్కోరు చేయకుంటే?

మాంచెస్టర్ లో ప్రారంభమయిన ఇండియా - ఇంగ్లండ్ నాలుగో టెస్ట్ లో భారత్ తొలి రోజు ప్రదర్శనలో తీరు మారలేదు

Update: 2025-07-24 01:58 GMT

మాంచెస్టర్ లో ప్రారంభమయిన ఇండియా - ఇంగ్లండ్ నాలుగో టెస్ట్ లో భారత్ తొలి రోజు ప్రదర్శనలో తీరు మారలేదు. గత టెస్ట్ లకు భిన్నంగా మాత్రం ఏమీ జరగలేదు. రెండు టెస్టులు ఇంగ్లండ్ పై ఓటమి పాలయినా నాలుగో టెస్ట్ లో గెలవాలన్న కసి భారత ఆటగాళ్లలో లోపించింది. అంతా తడబాటుతో వికెట్లను సమర్పించుకోవాల్సి వచ్చింది. కానీ కొందరు ఆటగాళ్లు నిలదొక్కుకోవడంతో మొదటి రోజు పరవాలేదనిపించింది. కానీ అనుకున్న స్థాయిలో రాణించలేదన్నది విశ్లేషకుల అంచనా. 94 పరుగుల వరకూ వికెట్లు కోల్పోకుండా ఆడిన భారత్ జట్టు 140 పరుగులకు వచ్చేసరికి మూడు వికెట్లను కోల్పోవడాన్ని బట్టి అర్థమవుతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో...
సిరీస్ సజీవంగా ఉండాలంటే మాంచెస్టర్ లో మ్యాచ్ తప్పక గెలిచి తీరాల్సిన పరిస్థితుల్లో టీం ఇండియా ఆటగాళ్లు ఆశించిన రీతిలో రాణించలేదనే చెప్పాలి. మరొక వైపు రిషబ్ పంత్ గాయంతో రిటైర్ట్ హర్ట్ గా వైదొలగడంతో ఈరోజు ఆడతాడా? లేదా? అన్నది చూడాలి. రిషబ్ పంత్ గాయం నుంచి కోలుకోకుంటే మాత్రం ఎదురుదెబ్బ. ఆరంభంలో పరవాలేదనిపించిన భారత్ తర్వాత వరసగా వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ బౌలర్లలో షుషారును పెంచినట్లయింది. సాయి సుదర్శన్ 61 పరుగులు చేసి పరవాలేదనిపించాడు. యశస్వి జైశ్వాల్ 58 పరుగులు చేసి ఓకే అనిపించాడు.కేఎల్ రాహుల్ 46 పరుగులు మాత్రమే చేసి అర్ధ సెంచరీ మిస్ చేసుకోవడమే కాకుండా జట్టుపై భారాన్ని మోపాడు.
పంత్ వస్తేనే...
భారత్ జట్టు స్వల్ప మార్పులతో బరిలోకి దిగింది. కరుణ్ నాయర్ స్థానంలో సుదర్శన్ వచ్చాడు. ఇక నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో శార్దూల్ ఠాకూర్ దిగాడు. శుభమన్ గిల్ 12 పరుగులకే వెనుదిరిగాడు. జడేజా 19 పరుగులతోనూ, శార్దూల్ 19 పరుగులతో నూ బ్యాటింగ్ చేస్తున్నారు. 83 ఓవర్లలో భారత్ నాలుగు వికెట్లను సమర్పించుకుంది. ఈరోజు రిషబ్ పంత్ గాయం నుంచి కోలుకుని తిరిగి మ్యాచ్ ఆడితే పరవాలేదు. కొద్దో గొప్పో స్కోరు చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే భారత్ కు భారీ స్కోరు చేసే అవకాశముండదు. అది ఇంగ్లండ్ అవకాశంగా మలచుకుంటుంది. అసలే మాంచెస్టర్ లో గెలుపు అనేది లేనిసమయంలో తొలి రోజు మనోళ్లు నిరాశపర్చినట్లయింది.


Tags:    

Similar News