విశ్వ విజేతగా నిఖత్ జరీన్

హైద‌రాబాదీ యువ బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్ మ‌హిళ‌ల ప్ర‌పంచ బాక్సింగ్ చాంపియ‌న్‌గా అవ‌త‌రించింది. గురువారం రాత్రి ముగిసిన ఫైన‌ల్ మ్యాచ్‌లో నిఖ‌త్ విజ‌యం సాధించింది.

Update: 2022-05-20 02:14 GMT

హైద‌రాబాదీ యువ బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్ మ‌హిళ‌ల ప్ర‌పంచ బాక్సింగ్ చాంపియ‌న్‌గా అవ‌త‌రించింది. గురువారం రాత్రి ముగిసిన ఫైన‌ల్ మ్యాచ్‌లో నిఖ‌త్ విజ‌యం సాధించింది. థాయ్‌ల్యాండ్‌కు చెందిన జిట్‌పాంగ్‌ను చిత్తు చేసిన నిఖ‌త్ వుమెన్స్ వ‌ర‌ల్డ్ బాక్సింగ్ చాంపియ‌న్‌గా నిలిచింది. మ‌హిళ‌ల ప్రపంచ బాక్సింగ్ చాంపియ‌న్‌షిప్‌లో భాగంగా 52 కిలోల విభాగంలో ఫైన‌ల్‌లో జిట్ పాంగ్‌పై పంచ్‌ల వ‌ర్షం కురిపించింది నిఖ‌త్ జరీన్. జిట్ పాంగ్ ను 5-0 తేడాతో చిత్తు చేసింది. ఫైన‌ల్ మ్మాచ్‌లో విజ‌యం సాధించిన నిఖ‌త్ స్వ‌ర్ణ ప‌త‌కాన్ని సాధించి 52 కిలోల విభాగంలో వ‌ర‌ల్డ్ బాక్సింగ్ చాంపియ‌న్‌గా నిలిచి చ‌రిత్ర సృష్టించింది. టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా జరిగిన ఈ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో 52 కిలోల విభాగంలో జరీన్ గోల్డ్ మెడల్ గెలిచింది. 73 దేశాల నుంచి దాదాపు 310 మంది మహిళా బాక్సర్లు పాల్గొన్నారు. ఈ టోర్నీలో భారత్‌ నుంచి మొత్తం 12 మంది బాక్సర్లు బరిలోకి దిగగా.. నిఖత్‌ పసిడి సహా మనీషా మౌన్‌ 57కేజీ విభాగంలో, పర్వీన్‌ హుడా 63కేజీ విభాగంలో కాంస్యాలు సాధించారు.

నిఖత్ జరీన్ వయసు 26. తల్లిదండ్రులు పర్వీన్ సుల్తానా, మహ్మద్ జమీల్ అహ్మద్. నిజామాబాద్ లో హై స్కూల్ విద్య పూర్తి అయ్యాక హైదరాబాద్ దోమలగూడ లో వున్న ఎ.వి.కాలేజీ లో బి.ఎ., పూర్తి చేసింది. ఎ.సి.గార్డ్స్ లో వున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా లో స్టాఫ్ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తోంది. 2009లో విశాఖపట్నం వెళ్లి స్పోర్స్ అథారిటీ లో చేరింది. అక్కడ ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐ.వి.రావు గారి దగ్గర శిక్షణ పొందింది. 2010 లోనే జాతీయ స్థాయిలో గోల్డెన్ బెస్ట్ బాక్సర్ గా గెలిచింది. అనేక జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని మెడల్స్ సాధిస్తూనే ఉంది. అడిదాస్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా 2018 లో నియమితురాలైంది. నిజామాబాద్ పట్టణ అధికార బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతోంది. స్వర్ణం సాధించిన ఆమెకు భారత రాష్ట్రపతి, ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
నిఖత్ జరీన్ సాధించిన అద్భుతమైన విజయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రశంసించారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ వేదికపై భారత జండాను రెపరెపలాడించిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్‌ను సీఎం కేసిఆర్ ట్విటర్ ద్వారా అభినందించారు. ప్రభుత్వం అందించిన ప్రోత్సాహాన్ని నిఖత్ జరీన్ సద్వినియోగం చేసుకున్నారని.. అందువల్లే బాక్సింగ్ క్రీడలో ఆమె విశ్వ విజేతగా నిలిచారని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ సాధించిన నిఖత్ జరీన్ కు పలువురు శుభాకాంక్షలు చెప్పారు. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన మన తెలంగాణ బాలిక నిఖత్ జరీన్ కు మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన ప్రోత్సాహ స్పూర్తితో తెలంగాణ పేరును జాతీయ స్థాయిలో నిలిపిన బాక్సర్ నికత్ జరీన్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు చెప్పుకొచ్చారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి హరీష్ రావు ఆకాంక్షించారు.

ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో తెలంగాణా బిడ్డ నిజామాబాద్‎కు చెందిన నిఖత్ జరీన్ విశ్వ విజేతగా నిలవడం దేశానికి గర్వ కారణమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. స్వర్ణ పతకాన్ని సాధించిన నిఖత్ జరీన్‎కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.


Tags:    

Similar News