India Vs England : ఇదేందిరా అయ్యా.. సీనియర్లు లేని లోటు కనిపిస్తుందిగా.. ఈ మ్యాచ్ కూడా అంతేనా?
ఇండియా - ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ లో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ బ్యాటర్లు తడబడుతున్నారు.
ఇండియా - ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ లో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ బ్యాటర్లు తడబడుతున్నారు. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కోల్పోయే పరిస్థితిని కొని తెచ్చుకుంటున్నారు. ఇంగ్లండ్ బ్యాటర్లను కట్టడి చేయలేక భారత బౌలర్లు చేతులు ఎత్తివేస్తే.. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి నిలబడలేక భారత్ బ్యాటర్లు బ్యాట్లను నేలకేసి కొడుతున్నారు. చచ్చీ చెడీ భారత్ బౌలర్లు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 669 పరుగులకు ఆల్ అవుట్ చేసింది. దీంతో భారత్ కంటే ఇంగ్లండ్ 311 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 358 పరుగులకే ఆల్ అవుట్ కావడంతో ఇంగ్లండ్ అత్యధిక పరుగులను చేసి భారత్ ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచింది.
కనీసం డ్రా చేయడానికి...
311 పరుగుల లక్ష్యమంటే డ్రా చేసుకోవడానికి ప్రయత్నించాలి భారత బ్యాటర్లు. గెలుపు సంగతి పక్కన పెట్టి క్రీజులో నిలబడేందుకు ముందు ప్రయత్నించాలి. అయితే రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన వెంటనే భారత్ బ్యాటర్లు ఇద్దరు ఎలాంటి పరుగుల చేయకుండానే వెనుదిరిగారు. వోక్స్ వేసిన తొలి ఓవర్ లోనే టీం ఇండియాకు షాక్ తగిలింది. యశస్వి జైశ్వాల్ పరుగులు చేయకుండానే వోక్స్ వేసిన బంతికి దొరికిపోయాడు. ఇక అదే ఓవర్ లో సాయిసుదర్శన్ కూడా గోల్డెన్ డక్ అయ్యాడు. ఇద్దరు బ్యాటర్లు ఎలాంటి పరుగులు చేయకుండానే వెనుదిరగడంతో ఇక ఇంగ్లండ్ కు ఊపు వచ్చింది. కేఎల్ రాహుల్, శుభమన్ గిల్ నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్నారు. అంటే భారత్ పీకల్లోతు కష్టాల్లో రెండో ఇన్నింగ్స్ మొదటి ఓవర్ లోనే కూరుకుపోయిందన్న మాట.అయితే శుక్రవారం మాత్రం శుభమన్ గిల్, కేఎల్ రాహుల్ కొంత నిలబడటంతో ఇక ఆశలు చిగురించాయి.
ఇద్దరూ నిలబడగలిగితేనే...?
వీరిద్దరూ చివరి రోజు నిలిచి లక్ష్యాన్ని చేరుకుంటే మాత్రం టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశముంది. లేకపోతే మాత్రం ఈ మ్యాచ్ కూడా ఓడిపోయే అవకాశాలున్నాయి. తొలి రెండు వికెట్లు పడిన తర్వాత కేఎల్ రాహుల్ 87 పరుగులతోనూ, శుభమన్ గిల్ 78 పరుగులతోనూ బ్యాటింగ్ చేస్తున్నారు. నిన్న మరొక వికెట్ పడకపోవడం కొంత శుభపరిణామమే. భారత్ రెండో ఇన్నింగ్స్ లో 174 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. ఈ జోడి మరో నాలుగైదు గంటలు క్రీజులో నిలబడితే కొంత డ్రా అయ్యే అవకాశాలున్నాయి. భారత్ ఇంకా ఇంగ్లండ్ కంటే 137 పరుగులు మాత్రమే వెనకబడి ఉంది. ఎక్కువసేపు ఈరోజు క్రీజులో నిలదొక్కుకోవం భారత్ బ్యాటర్లకు అవసరం. మరి ఈరోజు ఏం జరుగుతుందో చూడాలి.