India Vs South Africa : ఇది కదయ్యా.. మాక్కావాల్సింది.. ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్ళకు చూశాం.. సిరీస్ మనదే
విశాఖలో జరిగిన భారత్ - దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది
విశాఖలో జరిగిన భారత్ - దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. వన్డే సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. ఒక వికెట్ కోల్పోయి మాత్రమే దక్షిణాఫ్రికా విధించిన లక్ష్యాన్ని భారత్ సాధించింది. 2-1 తేడాతో భారత్ సిరీస్ ను గెలుచుకుంది. టాస్ గెలిచిన టీం ఇండియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే తొలి రెండు వన్డేల్లో మాదిరిగా కాకుండా భారత్ దక్షిణాఫ్రికాను కొంత తక్కువ పరుగులకే అవుట్ చేయగలిగింది. దక్షిణాఫ్రికా కేవలం 47.1 ఓవర్లలోనే అన్ని వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. భారత్ ఈ మ్యాచ్ లో గెలవాలంటే 271 పరుగులు చేయాల్సి ఉంది. భారత్ బ్యాటింగ్ బలమైన భాగస్వామ్యమే ఇండియాను విజయం దిశగా నడిపించింది.
తక్కువ పరుగులకే...
భారత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ నాలుగు వికెట్లు, కుల్ దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీశారు. తొలుత బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా ఒక పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది. అయితే కెప్టెన్ బవుమా, ఓపెనర్ డీకాక్ లు కలసి ఇన్నింగ్స్ ను ఏర్పరిచారు. కెప్టెన్ బవుమా 48 పరుగులు చేసి అవుటయ్యాడు. నిలబడిన డీకాక్ మాత్రం 106 పరుగులు చేయగలిగాడు. అయితే తర్వాత ఎవరూ పెద్దగా నిలబడలేకపోయి చేతులెత్తేశారు. బ్రీజ్కే 24 పరుగులకలకే అవుటయ్యాడు. యాన్సెన్ పదిహేడు పరుగులకే వెనుదిరిగాడు. బార్ట్ మన్ మూడు పరుగులు మాత్రమే చేశాడు. దక్షిణాఫ్రికా మొత్తం 47.5 ఓవర్లలోనే ఆల్ అవుట్ అయి 270 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఒక వికెట్ మాత్రమే కోల్పోయి...
తర్వాత 271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తొలుత నిలకడగా ఆడింది. ఓవర్ కు నాలుగు రన్ రేట్ మాత్రమే ఉన్నా వికెట్ కోల్పోకుండా ఆడటంతో రోహిత్ శర్మ మరొకసారి 75 పరుగులు చేసి వెనుదిరిగాడు. గత రెండు వన్డేల్లో విఫలమయిన యశస్వి జైశ్వాల్ మాత్రం ఈ మ్యాచ్ లో తన స్థానాన్ని స్థిరపర్చుకోవడం కోసం శ్రమించాడు. నెమ్మదిగా ఆడుతూ సిక్సర్లు, ఫోర్లతో విజృంభించాడు. యశస్వి జైశ్వాల్ 116 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. రోహిత్ అవుట్ అయిన తర్వాత కోహ్లి వచ్చి తనదైన శైలిలో ఆడి 65 పరుగులు చేశాడు. దీంతో భారత్ 40.1 ఓవర్లలోనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా యశస్వి జైశ్వాల్ నిలిచాడు. మొత్తం మీద సొంత గడ్డ మీద తమకు తిరుగులేదని భారత్ మరొకసారి నిరూపించుకుంది.