India vs Newzealand : తొలి వన్డే మనదే.. నాగపూర్ లో గెలిచిన టీం ఇండియా
భారత్ - న్యూజిలాండ్ మధ్య నాగపూర్ లో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది
భారత్ - న్యూజిలాండ్ మధ్య నాగపూర్ లో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. అభిషేక్ శర్మ కాసేపు బ్యాటుతో ఆడుకోవడంతో అంతటి భారీ స్కోరు లభించింది. బౌలర్లు కూడా మూడు వికెట్లు తర్వాత వికెట్ తీయడానికి ఇబ్బంది పడినా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి న్యూజిలాండ్ చేసిన శ్రమ ఫలించలేదు. ఐదు టీ 20 సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యతతో నిలిచింది. భారత్ న్యూజిలాండ్ పై 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియా ఏడు వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. వన్డే సిరీస్ ను కోల్పోయిన టీం ఇండియా టీ 20 సిరీస్ లో మొదటి మ్యాచ్ ను గెలిచి ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది.
అభిషేక్ శర్మ విజృంభించడంతో...
సంజూశాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా దిగారు. అయితే సంజూ శాంసన్ పది పరుగులకే అవుట్ అయినా అభిషేక్ శర్మ తన బ్యాటును ఝళిపించాడు. అభిషేక్ శర్మ మొత్తం 35 బంతుల్లో ఎనభై నాలుగు పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది సిక్సర్లు, ఐదు ఫోర్లు ఉన్నాయి. అభిషేక్ శర్మను అవుట్ చేయడానికి శతవిధాలుగా ప్రయత్నించినా చాలా సేపు సాధ్యం కాలేదు. సూర్యకుమార్ యాదవ్ 32,ఇషాన్ కిషన్ ఎనిమిది,హార్థిక్ పాండ్యా 25, శివమ్ దూబె తొమ్మిది పరుగులు చేశారు. రింకూ సింగ్ మాత్రం చివర వరకూ నిలిచి తన దైన ఇన్నింగ్స్ ఆడాడు. అత్యంత విలువైన ఇన్నింగ్స్ ఆడి 44 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో భారత్ ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది.
న్యూజిలాండ్ తడబడి...
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆదిలోనే తడబడింది. అర్షదీప్ సింగ్ కాన్వేను రెండో బంతికే అవుట్ చేయగా, రచిన్ ను హార్థిక్ పాండ్యా వెనక్కు పంపాడు. దీంతో కేవలం రెండు పరుగులకే రెండు కీలకమైన వికెట్లు పడ్డాయి. అయితే తర్వాత ఫిలిప్స్, రాబిన్సన్ విలువైన ఇన్నింగ్స్ ఆడారు. రాబిన్సన్ 21 పరుగులకు అవుట్ కాగా, ఫిలిప్స్ మాత్రం 78 పరుగుల చేశాడు. చాప్ మెన్ 39 పరుగులు చసి అవుటయ్యాడు. మిచెల్ 28 పరుగులకే వెనుదిరిగాడు, శాంటర్న్ ఇరవై పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇరవై ఓవర్లలో న్యూజిలాండ్ మొత్తం ఏడు వికెట్లు కోల్పోయి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబె చెరో రెండు వికెట్లు, అర్షదీప్, హార్థిక్ తలో వికెట్ తీయగా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా అభిషేక్ శర్మ ఎంపికయ్యాడు.