India Women World Cup : విశ్వవిజేత... భారత్.. ఎంత నిరీక్షణ.. ఎంత శ్రమ

భారత మహిళలకు చారిత్రాత్మక కిరీటం దక్కింది. దక్షిణాఫ్రికాపై భారత్ అద్భుతమైన విజయం సాధించి వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది

Update: 2025-11-03 01:41 GMT

భారత మహిళలకు చారిత్రాత్మక కిరీటం దక్కింది. దక్షిణాఫ్రికాపై భారత్ అద్భుతమైన విజయం సాధించి వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. ముంబయిలో జరిగిన మ్యాచ్ లో భారత్ దక్షిణాఫ్రిపై గెలిచి సరికొత్త చరిత్రను సృష్టించింది. దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. మహిళల క్రికెట్ లో అద్భుతమే జరిగింది. అందరూ అంచనాలు వేసుకున్నట్లుగానే.. భారత్ మహిళల క్రికెట్ లో దాదాపు నాలుగు దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 298 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా యాభై ఓవర్లలో 299 పరుగులు చేయాలన్న లక్ష్యంగా విధించింది. అయితే బ్యాటర్లు, బౌలర్లు సంయుక్తంగా రాణించడంతో ఈ విక్టరీ మనకు సొంతమయింది.

యాభై రెండు పరుగుల తేడాతో...
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. ఆదివారం రాత్రి డీవై పాటిల్‌ స్టేడియంలో జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో గెలిచి భారత మహిళలు తొలిసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్నారు. భారత్‌ విజయంలో ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ 5 వికెట్లు తీసుకుని బౌలింగ్‌లో అద్భుతంగా రాణించగా, షఫాలీ వర్మ బ్యాట్‌, బంతితో కీలక పాత్ర పోషించారు. దక్షిణాఫ్రికా కెప్టెన్‌ లారా వూల్వార్డ్‌ 42వ ఓవర్‌లో అవుట్‌ కావడంతో ఆ జట్టు ఆశలు కరిగిపోయాయి. అదే ఓవర్‌లో క్లోయ్‌ ట్రయాన్‌ తొమ్మిది పరుగుల వద్ద వెనుదిరగడంతో విజయదారిలో భారత్‌ దూసుకెళ్లింది. నాడిన్‌ డి క్లెర్క్‌ చివరలో ప్రతిఘటన కనబరిచినా ఫలితం లేకుండా 45.3 ఓవర్లలో 246 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌటైంది.
వరల్డ్ కప్ విజేతగా...
దీప్తి శర్మ ఐదు వికెట్లు తీయగా, షఫాలీ రెండు వికెట్లు తీసింది. షఫాలీ తన మొదటి ఓవర్‌లోనే సూనే లూస్‌ను, ఆపై మారిజాన్‌ కాప్‌ను అవుట్‌ చేసి భారత ఆధిపత్యాన్ని బలపరిచింది. తాజ్మిన్‌ బ్రిట్స్‌ రన్‌అవుట్‌ రూపంలో భారత జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆమె, వూల్వార్డ్‌ కలిసి వేగంగా 50 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యం అందించారు. అయితే ఆ తర్వాత భారత బౌలర్లు బీభత్సం సృష్టించారు. ముందుగా భారత్‌ ఏడు వికెట్లు కోల్పోయి 298 పరుగులు సాధించింది. మహిళల వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఇది రెండో అత్యధిక స్కోరు. స్మృతి మందనా (45), షఫాలీ వర్మ (87) శతకం దిశగా దూసుకెళ్లగా, దీప్తి (58) ఇన్నింగ్స్‌కు పునాది వేశారు. చివర్లో రిచా ఘోష్‌ (34) వేగంగా ఆడింది. ఫలితంగా వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలిచింది.


Tags:    

Similar News