పాకిస్థాన్ చేతిలో ఓటమి పాలైన భారత్

20 ఓవర్లు కూడా ఆడకుండానే భారత్ లక్ష్యానికి 13 పరుగుల దూరంలో నిలిచింది

Update: 2022-10-07 11:05 GMT

ఆసియా కప్ మహిళల టీ-20 టోర్నమెంట్ లో భారత జట్టుపై పాకిస్థాన్ విజయాన్ని అందుకుంది. భారత్ పై 13 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది పాక్. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగా.. భారత మహిళల జట్టు 19.4 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 124 పరుగులకు ఆలౌట్ అయింది.

టాస్ గెలిచిన పాక్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 26 పరుగుల వద్ద పాక్ మొదటి వికెట్ ను కోల్పోయింది. అమీన్ ను పూజా వస్త్రాకర్ అవుట్ చేసింది. ఆ తర్వాత మరో ఓపెనర్ మునీబా అలీ 17 పరుగులు చేసి దీప్తి శర్మ బౌలింగ్ లో వెనుదిరిగింది. ఆ తర్వాత వచ్చిన ఒమైనా సోహైల్ డకౌట్ గా వెనుదిరిగింది. మరో వైపు స్టార్ బ్యాటర్ నిదా ధర్ మాత్రం పరుగులు రాబడుతూ ముందుకు వెళ్ళింది. 37 బంతుల్లో 56 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. కెప్టెన్ మరూప్ 32 పరుగులతో పర్వాలేదనిపించింది. దీప్తి శర్మ ఈ మ్యాచ్ లో 3 వికెట్లు తీయగా.. పూజాకు రెండు, రేణుక సింగ్ కు ఒక వికెట్ లభించింది.
లక్ష్య ఛేదనలో భారత జట్టు ప్రణాళికాబద్ధంగా ఆడలేకపోవడంతో ఓటమిని మూటగట్టుకుంది. ఈ టోర్నమెంట్ లో ఓటమన్నది ఎరగని భారత జట్టు.. పాక్ చేతిలో మొదటి ఓటమిని చవిచూసింది. మేఘన 15, స్మ్రతి మందాన 17, హేమలత 20, దీప్తి శర్మ 16, హర్మన్ ప్రీత్ 12 పరుగులతో పర్వాలేదనిపించగా.. మిగిలిన వారు విఫలమయ్యారు. ఆఖర్లో రిచా ఘోష్ 13 బంతుల్లో 26 పరుగులు చేసి భారత శిబిరంలో ఆశలను నింపినా.. పాక్ బౌలర్లు కీలక సమయంలో ఆమెను అవుట్ చేసి విజయాన్ని దక్కించుకున్నారు. 20 ఓవర్లు కూడా ఆడకుండానే భారత్ లక్ష్యానికి 13 పరుగుల దూరంలో నిలిచింది. నిదా దార్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.


Tags:    

Similar News