Asia Cup : దుబాయ్ లో దుమ్ము దుమారమే... బ్యాట్ కు బంతి తగిలితే ఇక అంతే
ఆసియా కప్ లో భారత్ నేడు యూఏఈతో తలపడుతుంది.దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
ఆసియా కప్ లో భారత్ నేడు యూఏఈతో తలపడుతుంది.దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో భారత్ కు పెద్దగా ఇబ్బంది లేదు. యూఏఈపై గెలవడం అందులోనూ టీ20 లలో భారత్ బలంగా ఉండటంతో గెలుపు నల్లేరు మీద నడకే. అలాగని నిర్లక్ష్యం ఉండకూడదు. రన్ రేట్ కోసం ప్రయత్నించాలన్నది క్రీడా విశ్లేషకుల అభిప్రాయం. ముందుగా బ్యాటింగ్ చేస్తే భారత్ అత్యధిక పరుగులు సాధించడం, ముందుగా ఫీల్డింగ్ చేస్తే తక్కువ పరుగులకే యూఏఈని వెనక్కు పంపడం వంటివి చేయాలని అంటున్నారు. అలాగని యూఏఈని కూడా తక్కువగా అంచనాలు వేయకూడదు. పసికూనలని భావించి ఏ మాత్ర నిర్లక్ష్యం ప్రదర్శించినప్పటికీ అందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
గెలుపుపై అనుమానం...
అయితే యూఏఈపై గెలుపు పై ఎవరికీ అనుమానం లేకపోయినా సరే జాగ్రత్తగా ఆడితే మంచిదని సూచిస్తున్నారు. ఇక టీం ఇండియా కేవలం బౌలర్లు మీదనే ఆధారపడకుండా ఫీల్డర్లు కూడా జాగ్రత్తగా చేసి క్యాచ్ ల విషయంలో పట్టు జారిపోకుండా చూసుకోవాలంటున్నారు. ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగిన టీం ఇండియా బ్యాటింగ్, బౌలింగ్ లో బలంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తిపైన భారత్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తొలి సారి వరుణ్ చక్రవర్తి ఆసియా కప్ లో పాల్గొంటున్నాడు. వరుణ్ పద్దెనిమిది మ్యాచ్ లు ఆడి 33 వికెట్లు తీశాడు. ప్రధాన స్పిన్నర్ గా టీం ఇండియాకు తురుపుముక్క అని చెప్పాలి.ఈ మ్యాచ్ లోనూ వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మాయాజాలంతో వికెట్లు చకా చకా తీయాలని భారత్ అభిమానులు కోరుకుంటున్నారు.
బలమైన బ్యాటింగ్ లైనప్...
ఇక ఓపెనర్లు శుభమన్ గిల్, అభిషేక్ శర్మ దూకుడుతో ఆడాలని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గిల్ అన్ని ఫార్మాట్లలో రాటుదేలి ఉన్నాడు. అభిషేక్ శర్మ నిలదొక్కుకుంటే మాత్రం అతనిని ఆపడం ఎవరి తరమూ కాదు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎటూ ఉండనే ఉన్నాడు.తన షాట్లతో భారత్ అభిమానులకు మంచి ఫీస్ట్ ఇచ్చే ఛాన్సుంది. అదే సమయంలో హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ నిదానంగా ఆడినా జట్టుకు మంచి బలం అని చెప్పొచ్చు. హార్ధిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ వరకూ మన బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉండటంతో భారత్ తొలుత బ్యాటింగ్ కు అందుకుంటే దుమ్ము దులుపుతారన్న అంచనాలు బాగా వినిపిస్తున్నాయి. అయితే లక్ కూడా కలసి రావాలి. ఈరోజు రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.