Asia Cup : మళ్లీ భారత్ - పాక్ మ్యాచ్ ఉంటుందా? ఉంటే ఆ కిక్కే వేరప్పా
ఆసియా కప్ లో భారత్ విజయాలకు బ్రేక్ లేకుండా ముందుకు వెళుతుంది. అయితే మరోసారి పాకిస్తాన్ తో భారత్ తలపడే అవకాశాలు ఎంత వరకూ ఉన్నాయన్న దానిపై చర్చ జరుగుతుంది
ఆసియా కప్ లో భారత్ విజయాలకు బ్రేక్ లేకుండా ముందుకు వెళుతుంది. అయితే మరోసారి పాకిస్తాన్ తో భారత్ తలపడే అవకాశాలు ఎంత వరకూ ఉన్నాయన్న దానిపై చర్చ జరుగుతుంది. మిగిలిన జట్లతో ఆట ఒక ఎత్తు.. పాకిస్తాన్ తో గేమ్ మరొక ఎత్తు. రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. గూస్ బమ్స్ మాత్రమే కాదు...ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు మొత్తం అటెన్షన్ తో మునికాళ్లపై నిలబడి మరీ మ్యాచ్ చూస్తుంటారు. ఇప్పటి వరకూ ఆసియా కప్ లో భారత్ - పాక్ ల మధ్య రెండు సార్లు మ్యాచ్ జరిగింది. తొలి మ్యాచ్ లీగ్ దశలో భారత ఏడు వికెట్లతో గెలుపొందింది. సూపర్ 4 దశలో రెండో మ్యాచ్ లో భారత్ ఆరు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది.
ఆధిపత్యం మాత్రం టీం ఇండియాదే...
ఒకసారి బౌలర్లు.. మరొకసారి బ్యాటర్లు పాకిస్తాన్ ను ఇరుకున పెట్టేందుకు టీం ఇండియా ప్రయత్నిస్తుండటంతో చేష్లలుడిగి చూడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి నెలకొని ఉంది. ఎందుకంటే మైదానంలోకి అడుగు పెట్టిన తర్వాత టీం ఇండియా ఆధిపత్యమే కనిపిస్తుంది. లీగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ బ్యాటర్లు విఫలమయి.. బౌలర్లు సక్సెస్ అయ్యారు. అదే మ్యాచ్ లో భారత్ బౌలర్లు సత్తా చాటారు. రెండో మ్యాచ్ లో పాకిస్తాన్ బ్యాటర్లు మోస్తరుగా పరవాలేదనిపించి మంచిస్కోరు చేయగలిగారు. కానీ బౌలర్లు మాత్రం సరైన సమయంలో వికెట్లు దొరకబుచ్చుకోలేకపోయారు. భారత్ పరిస్థితి కూడా అదే అయినప్పటికీ పై చేయి మాత్రం టీం ఇండియాదే అవుతుండటంతో పాకిస్తాన్ ఆటగాళ్లలో ఫ్రస్టేషన్ పీక్స్ కు చేరుకుంటుంది.
ఇలా జరిగితేనే...
అయితే మరోసారి భారత్ - పాకిస్తాన్ ఫైనల్ లో ఎదురు పడే అవకాశాలు లేకపోలేదు. సూపర్ 4లో టాప్ 2లో నిలిచిన రెండుజట్లు ఫైనల్స్ కు చేరుకుంటాయి. అయితే భారత్ ఇంకా బంగ్లాదేశ్, శ్రీలంకతో మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్ లో గెలిస్తే భారత్ నేరుగా ఫైనల్ కు చేరుకుంటుంది. ఒక మ్యాచ్ లో గెలిచినా ఫైనల్ కు చేరే అవకాశాలు నెట్ రన్ రేట్ ప్రకారం ఎక్కువగా ఉన్నాయి. పాకిస్తాన్ కూడా మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అది కూడా శ్రీలంక, బంగ్లాదేశ్ లతో ఆడాల్సి ఉంటుంది. ఆ రెండు మ్యాచ్ లలో పాకిస్తాన్ ఖచ్చితంగా గెలవాలి. ఏ మ్యాచ్ లో ఓడిపోయినా ఫైనల్ కు చేరుకోవడం క్లిష్టమవుతుంది. ఒక మ్యాచ్ లో గెలిచి మరొక మ్యాచ్ లో గెలిస్తే ఫైనల్లో చేరడానికి కష్టమవుతుంది. అయితే ఏది ఫైనల్స్ కు చేరుతాయన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది. క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం మళ్లీ ఫైనల్ లో పాక్ తోనే భారత్ తలపడాలని కోరుకుంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.