India Vs West Indies ; క్లీన్ స్వీప్ దిశగా భారత్.. వెస్టిండీస్ పై పూర్తి ఆధిపత్యం
భారత్- వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత్ విజయం దిశగా అడుగులు వేస్తుంది
భారత్- వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత్ విజయం దిశగా అడుగులు వేస్తుంది. ఆఖరి రోజు ఆటలో మరో యాభై ఎనిమిది పరుగులు చేస్తే విజయం సొంతమవుతుంది. దీంతో వెస్టిండీస్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసే దిశగా భారత్ జట్టు పయనిస్తుంది. విజయానికి భారత్‌కు ఇంకా 58 పరుగులు మాత్రమేఉండటంతో అది పెద్ద లక్ష్యం కాదన్నది అందరి అభిప్రాయం. అందుకే వెస్టిండీస్ లో జరుగుతున్న రెండు టెస్ట్ లను గెలిచి భారత్ క్లీన్ స్వీప్ చేయనుందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి.
యశస్వి అవుటయినా...
రెండో టెస్ట్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ కోల్పోయి అరవై మూడు పరుగులు చేసింది. దీంతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసే దిశగా జట్టు దూసుకెళ్తోంది.121 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలో యశస్వి జైస్వాల్ వికెట్ కోల్పోయింది. యశస్వి జైశ్వాల్ కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు. జైశ్వాల్ అవుట్ అయినప్పటికీ కేఎల్ రాహుల్ ఇరవై ఐదు పరుగులతో నాటౌట్‌గా, సాయి సుధర్శన్ 30 పరుగులతో నాటౌట్ గా క్రీజులో ఉండి జట్టును నిలబెట్టారు. ఈ జంట జాగ్రత్తగా ఆడుతూ భారత్‌ను విజయపథంలో నడిపించారు.
జస్ప్రిత్ బుమ్రా అవుట్ చేసి..
దీనికి ముందు, వెస్టిండీస్ చివరి వికెట్‌కై జస్టిన్ గ్రీవ్స్ అర్థ సెంచరీ పూర్తి చేశారు. , జేడెన్ సీల్స్ 32 పరుగులు చేసి 79 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వారి పోరాటం కొంతసేపు భారత బౌలర్లను ఇబ్బంది పెట్టింది. అయితే జస్ప్రిత్ బుమ్రా కీలకంగా సీల్స్‌ను ఔట్ చేసి ఆ జోడీని విడగొట్టాడు. దీంతో వెస్టిండీస్ కష్టాల్లో పడింది. తక్కువ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. భారత్ కు ఈ స్కోరు పెద్ద లక్ష్యమేమీ కాదు. అందుకే రెండో టెస్ట్ లోనూ భారత్ విజయం ఖాయమన్నది దాదాపుగా తేలిపోయింది. ఇప్పటికే తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ తేడాతో భారత్ విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది.