India vs Newzealand : భారత్ కు తిరుగులేదు.. టార్గెట్ ను ఊదిపారేశారు

గౌహతిలో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్‌పై భారత్‌ ఘన విజయం సాధించింది

Update: 2026-01-26 02:08 GMT

గౌహతిలో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్‌పై భారత్‌ ఘన విజయం సాధించింది. భారత్ 8 వికెట్ల తేడాతో గెలుపొంది. దీంతో భారత్ - న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్ ల సిరీస్‌ ను మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. టీ20 వరల్డ్ కప్ సమీపిస్తున్న తరుణంలో టీం ఇండియా అద్భుతమైన ప్రదర్శనతో మరోసారి ఛాంపియన్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 154 పరుగులను మరో పది ఓవర్లు మిగిలి ఉండగానే ఛేజ్ చేశారు. చిరుత పులుల్లాగా వేటాడిన టీం ఇండియా ఆటగాళ్ల దెబ్బకు కివీస్ చిత్తయిపోయింది. మూడో టీ20లో న్యూజిలాండ్‌పై భారత్‌ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 3-0తో తిరగరాని ఆధిక్యం సాధించింది.

బౌలింగ్ లోనూ...
టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌ కట్టుదిట్టమైన ప్రదర్శన చేసింది. జస్ప్రీత్‌ బుమ్రా మూడు వికెట్లు తీసి కేవలం పదిహేడు పరుగులుమాత్రమే ఇచ్చి కివీస్‌ను కట్టడి చేశాడు. హార్దిక్‌ పాండ్యా రెండు వికెట్లు తీసి ఇరవై మూడు పరుగులు ఇచ్చాడు. స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ రెండు వికెట్లు తీసి కేవలం పద్దెనిమిది పరుగులు మాత్రమే ఇచ్చాడు. హర్షిత్ రాణా కూడా కీలకమైన ఒక వికెట్ తీసి ముప్ఫయి ఐదు పరుగులు చేశారు. బౌలర్లందరూ కూడా క్రమశిక్షణతో బౌలింగ్‌ చేశారు. దీంతో న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 153 పరుగులకే పరిమితమైంది. అయితే ఈ లక్ష్య ఛేదన పెద్దగా భారత్ కు భారం కాకపోయినప్పటికీ జీరోకే సంజూ శాంసన్ వికెట్ పడిపోవడంతో ఒకరకమైన ఆందోళన తలెత్తింది.
రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి...
అయితే తర్వాత అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ లు లక్ష్యాన్ని పూర్తి చేశారు. లక్ష్య ఛేదనలో భారత్‌ దూకుడుగా ఆడింది. అభిషేక్‌ శర్మ 20 బంతుల్లో 68 పరుగులతో చెలరేగాడు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ 26 బంతుల్లో 57 పరుగులు సాధించాడు. వీరిద్దరి అర్ధసెంచరీలతో భారత్‌ కేవలం 10 ఓవర్లలోనే 155 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించింది.న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ 48 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మార్క్‌ చాప్మన్‌ 32, మిచెల్‌ సాంట్నర్‌ 27 ఉపయోగకరంగా ఆడారు. తొలి రెండు టీ20ల్లోనూ భారత్‌ గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో మరి రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే భారత్ న్యూజిలాండ్ పై టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్నట్లయింది.


Tags:    

Similar News