India vs New Zealand : రాయపూర్ కూడా మనదే.. న్యూజిలాండ్ పై భారత్ ఘన్ విజయం
రాయ్‌పూర్ లో టీం ఇండియా ఆటగాళ్లు చెలరేగి ఆడారు
రాయ్‌పూర్ లో టీం ఇండియా ఆటగాళ్లు చెలరేగి ఆడారు. టార్గెట్ ను ఛేదించడంలో టీం ఇండియా మరొకసారి తనకు తానే సాటి అని నిరూపించుకుంది. వరసగా రెండో టీ20లో భారత్ న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతోమరో ఇరవై ఎనిమిది బాల్స్ మిగిలి ఉండగానే విజయాన్ని ముద్దాడింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. అజేయంగా 82 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ దూకుడు 76 పరుగులతో మెరిపించాడు. వీరిద్దరి చెలరేగిన ఆటతో న్యూజిలాండ్‌పై భారత్ రెండో టీ20లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 209 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.2 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0తో ముందంజ వేసింది.
ఆరంభంలో తడబడినా...
టార్గెట్ ను ఛేధించడానికి బరిలోకి దిగిన భారత్ ఆరంభంలో తడబడింది. సంజూ శాంసన్ 6 పరుగులకే ఔట్ అయ్యాడు. అభిషేక్ శర్మ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. స్కోరు 6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోగా భారత్ క్లిష్టమైన పరిస్థితిలో ఉందన్న భావన వ్యక్తమయింది. ఆ దశలో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ కలిసి ఎదురుదాడికి దిగారు. మూడో వికెట్‌కు కేవలం 48 బంతుల్లోనే 122 పరుగులు జోడించారు. కష్టంగా కనిపించిన ఛేజింగ్ ను సులువుగా మార్చేశారు. ఇషాన్ కిషన్ ఆరంభం నుంచే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 21 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. 32 బంతుల్లో 76 పరుగులు చేసి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అప్పటికే మ్యాచ్ పూర్తిగా భారత్ వైపు మరలిలింది.
చెలరేగిన సూర్య...
ఆరంభంలో 10 బంతుల్లో 10 పరుగులతో నెమ్మదిగా ఉన్న సూర్యకుమార్ ఆ తర్వాత గేర్ మార్చాడు. క్రమంగా వేగం పెంచాడు. పైక్రమంలో వచ్చిన శివమ్ దూబే 200 స్ట్రైక్‌రేట్‌తో వేగంగా 36 పరుగులు చేశాడు. నాలుగో వికెట్‌కు సూర్యతో కలిసి 81 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అదే భారత్ విజయాన్ని ఖరారు చేసింది. సూర్యకుమార్ 37 బంతుల్లో అజేయంగా 82 పరుగులతో ఇన్నింగ్స్ ముగించాడు. స్వదేశంలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు కొన్ని వారాల ముందే తన ప్రాధాన్యతను చాటాడు. అంతకుముందు టాస్ గెలిచిన సూర్యకుమార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 208 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. రచిన్ రవీంద్ర 26 బంతుల్లో 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 27 బంతుల్లో అజేయంగా 47 చేశాడు. జాక్ ఫౌల్క్స్ 15 పరుగులు చేయగా నాటౌట్‌గా నిలిచాడు.
న్యూజిలాండ్ బౌలర్లు...
న్యూజిలాండ్ బౌలర్లు తీవ్రంగా తడబడ్డారు. జాక్ ఫౌల్క్స్ మూడు ఓవర్లలో 67 పరుగులు ఇచ్చాడు. ఇది పూర్తి సభ్య దేశానికి చెందిన బౌలర్ టీ20 అంతర్జాతీయాల్లో ఇచ్చిన అత్యధిక పరుగులుగా రికార్డైంది. 2025లో వెస్టిండీస్‌పై ఐర్లాండ్ తరఫున లియామ్ మెకార్తీ ఇచ్చిన 63 పరుగుల రికార్డును ఇది చెరిపేసింది. జేకబ్ డఫీ, ఇష్ సోధీ, మ్యాట్ హెన్రీ ఒక్కో వికెట్ తీశారు.భారత్ బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ 35 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసి మెరిశాడు. హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే ఒక్కో వికెట్ తీశారు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై మిగతా బౌలర్లు ఇబ్బంది పడ్డారు.ఫలితంగా భారత్ 7 వికెట్లతో విజయం సాధించింది.