నెదర్లాండ్స్ పై ఘన విజయాన్ని అందుకున్న భారత్

Update: 2022-10-27 10:29 GMT

భారత జట్టు టీ20 ప్రపంచ కప్ లో మరో విజయాన్ని అందుకుంది. నెదర్లాండ్స్ పై అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యాన్ని చెలాయించిన భారత్ సూపర్-12 లో మరో విక్టరీ కొట్టింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్.. ఏ సమయంలోనూ లక్ష్యం వైపుగా అడుగులు వేయలేదు. అటు భారత ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు వరుసగా వికెట్లు తీస్తూ వెళ్లడంతో.. రన్ రేట్ భారీగా పెరిగిపోయింది. 20 ఓవర్ల పాటూ బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్ 56 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. నెదర్లాండ్స్ బ్యాట్స్మెన్ లో టిమ్ ప్రింగిల్ 20 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్, అశ్విన్, అక్షర్ పటేల్ తలా రెండేసి వికెట్లు తీయగా.. షమీకి ఒక వికెట్ దక్కింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 179 పరుగుల స్కోరు చేసింది. కెఎల్ రాహుల్, నెదర్లాండ్స్‌ మ్యాచ్ లోనూ విఫలమయ్యాడు. 12 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, వాన్ మీకీరన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. కెఎల్ రాహుల్ డీఆర్‌ఎస్ కూడా తీసుకోకుండా పెవిలియన్ చేరాడు. టీవీ రిప్లైలో బంతి వికెట్లను మిస్ అవుతున్నట్టు స్పష్టంగా కనిపించింది. రోహిత్ శర్మ ఇచ్చిన క్యాచ్ లను నెదర్లాండ్స్ ఫీల్డర్లు డ్రాప్ చేయడంతో రెండు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుని.. 39 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ అవుటైన తర్వాత సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ కలిసి మూడో వికెట్‌కి అజేయంగా 95 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు చేసి, టీ20 వరల్డ్ కప్‌లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 25 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 51 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్సర్ బాది హాఫ్ సెంచరీ అందుకున్నాడు.


Tags:    

Similar News