Asia Cup : బంతి తన్నింది.. బ్యాట్ మురిసింది.. పాక్ పై ఇండియా సూపర్ విక్టరీ
ఆసియా కప్ లో సూపర్ 4 పోరులో భారత్ పాకిస్తాన్ పై అద్భుతమైన విజయం సాధించింది. దుబాయ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో బ్యాటర్లు చెలరేగిపోయారు.
భారత్ - పాకిస్తాన్ ల మధ్య ఆసియా కప్ లో సూపర్ 4 మ్యాచ్ మొదట చూసిన వారికి టీం ఇండియాను వైఫల్యాలను తిట్టుకుని ఉంటారు. చెత్త ఫీల్డింగ్.. ఎన్ని క్యాచ్ లు మిస్ చేశారు.. అంది వచ్చిన క్యాచ్ ను వదిలేయడంతో భారత్ అభిమానుల ఆవేశంతో టీవీల ఎదుట ఊగిపోయి ఉంటారు. ఇక బౌలింగ్ లో కూడా పస కనిపించకపోవడంతో ఈ మ్యాచ్ ఓడిపోవడం ఖాయమని భావించి ఉంటారు. కానీ టీం ఇండియా అందరి అభిమానులను తలకిందులు చేస్తూ టీ 20 పార్మాట్ లో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది. ఆదివారం ఆసియా కప్ లో సూపర్ 4 పోరులో భారత్ పాకిస్తాన్ పై అద్భుతమైన విజయం సాధించింది. దుబాయ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో బ్యాటర్లు చెలరేగిపోయారు.
క్యాచ్ లు వదిలేసి...
టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. గత లీగ్ మ్యాచ్ లో చూసిన విధంగా తక్కువ పరుగులకే పాకిస్తాన్ ను భారత్ కట్టడి చేస్తుందని అనుకున్నా బంతి మనకు అచ్చిరాలేదు. కానీ బ్యాట్ మాత్రం తిరుగులేదనిపించింది. ఆరు వికెట్ల తేడాతో భారత్ ప్రత్యర్థి పాకిస్తాన్ పై విజయం సాధించింది. వార్ వన్ సైడ్ అన్నట్లుగానే భారత్ బ్యాటింగ్ సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టులో ఫర్హాన్ యాభై పరుగులు చేశాడు. ఫకార్ జమాన్ పదిహేను పరుగులకే వెనుదిరిగాడు. సైమ్ అయూబ్ 21 పరుగులతో సరిపెట్టుకున్నాడు. తలాత్ పది పరుగులు, మహ్మద్ నవాజ్ రనౌట్ అయి అవుటయ్యారు. సల్మాన్ ఆఘా నాటౌట్ గా నిలిచి పదిహేడు పరుగులు మాత్రమే చేసి ఇరవై ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే పాకిస్తాన్ చేయగలిగింది. అయితే దుబాయ్ పిచ్ మీద ఇది ఎక్కువ పరుగులే.
ఓపెనర్లే ముగించేస్తారనుకున్నా...
భారత్ బౌలర్లలో హార్ధిక్ ఒకటి, శివమ్ దుబే రెండు, కులదీప్ యాదవ్ ఒక వికెట్ తీశారు. అయితే 172 పరుగులు లక్ష్యాన్ని సాధించాల్సి ఉన్న భారత్ బ్యాట్ ను ఝుళిపించింది. అభిషేక్ శర్మ 74 పరుగులతో మెరిశాడు. శుభమన్ గిల్ 47 పరుగులు చేసి అర్ధ సెంచరీని చేయి జార్చుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయినప్పటికీ, తిలక్ వర్మ నాటౌట్ గా నిలిచి కేవలం 18.5 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసి భారత్ పాకిస్తాన్ పై విజయం సాధించింది. లక్ష్య సాధనలో భారత్ తమకు ఎదురులేదని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ లో ఈసారి కూడా షేక్ హ్యాండ్ లు లేవు. టాస్ దగ్గర నుంచిచివరకు మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా చేయి చేయి కలపకపోవడం విశేషం. మొత్తం మీద భారత్ తనకు టీ20 ఫార్మాట్ లో మరోసారి తిరుగులేదని నిరూపించుకోగలిగింది.