Ind Vs Eng Third Test : ఓటమిని కొని తెచ్చుకున్న టీం ఇండియా
ఇండియా - ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత్ కు పరాజయం దక్కింది
ఇండియా - ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత్ కు పరాజయం దక్కింది. చేతిలోకి వచ్చిన మ్యాచ్ చేజారి పోయింది. అందినట్లే అంది.. ఊరించినట్లే ఊరించి చివరకు తక్కువ పరుగులతో టీం ఇండియా ఓటమి పాలయింది. ఒకరకంగా చెప్పాలంటే ఇంగ్లండ్ బౌలర్లను మెచ్చుకోవచ్చు. భారత్ బ్యాటర్లను ఎవరినీ క్రీజులో నిలబడకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. అలాగే భారత్ బ్యాటర్ల వైఫల్యం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కనీసం ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లు నిలకడగా ఆడినా మ్యాచ్ డ్రా అయ్యేది. కానీ డ్రా మాట సంగతి దేవుడెరుగు అసలు పిచ్ పై నిలబడటమే కష్టమయిపోయింది మనోళ్లకు. చివరిరోజు ఆట మన వైపు ఉన్నా అందిపుచ్చుకోలేక అవస్థలు పడి మ్యాచ్ ను అప్పగించేశారు.
లక్ష్యాన్ని ఛేదించడంలో...
అతి చిన్న లక్ష్యాన్ని ఛేదించడంలో టీం ఇండియా ఘోరంగా విఫలమయింది. 198 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో మనోళ్లు చతికలపడ్డారు. ఇంగ్లండ్ బౌలర్లు కూడా కాలు కదపనివ్వకుండా కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు. నిజంగా ఈ విజయానికి ఇంగ్లండ్ కు పూర్తి అర్హత ఉందనిపించింది. అందరూ విఫలమయినా జడేజా కొంత పరవాలేదు.. గెలిపిస్తాడనుకున్న సమయంలో ఆ ఆశ కూడా లేకపోవడంతో అప్పటికే భారత్ కు అపజయం ఖాయంగా కనపించింది. జడేజా ఒకవైపు నిల్చున్నా మరొక వైపు మత్రం నిల్చునే వారు ఏరీ? నితీష్ కుమార్ రెడ్డి, జన్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ లు కూడా సరైన సహకారం అందించలేకపోయారు. కొంచెంసేపు ఉన్నప్పటికీ చివరకు వారు కూడా వెనుదిరిగారు.
ఇరవై మూడు పరుగులే...
చివరకు ఇరవై మూడు పరుగులు చేయాల్సిన సమయంలో వికెట్లన్నీ సమర్పించుకుని చేతులెత్తేసి మన పరిస్థితి ఇంతే అన్న స్థితిలో ఓటమిని కొని తెచ్చుకున్నారు. 170 పరుగులు చేసి టీం ఇండియా ఆల్ అవుట్ అయింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 387 పరుగులు చేయగా, టీం ఇండియా కూడా తొలి ఇన్నింగ్స్ లో 387 పరుగులు చేసింది. కనీసం తొలి ఇన్నింగ్స్ లోనైనా ఆధిక్యత సాధించి ఉంటే పరిస్థితి వేరులా ఉండేది. ఇక రెండో ఇన్నింగ్స్ 192 పరుగులకే ఆల్ అవుట్ అయింది. భారత్ బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేసి తక్కువ పరుగులకు అవుట్ చేసినా చివరకు 170 పరుగులు చేసి 22 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలయింది. సీనియర్ ఆటగాళ్లు లేని లోటు టీం ఇండియాలో స్పష్టంగా కనిపించింది.