నేటి నుంచి సమరం

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ కు భారత్ సిద్ధమయింది. నేడు మొహాలీలో తొలి మ్యాచ్ జరగనుంది.

Update: 2023-09-22 03:32 GMT

మరో మినీ సమరం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ కు భారత్ సిద్ధమయింది. ప్రపంచ కప్ కు ముందు జరుగుతున్న ఈ మ్యాచ్‌లు ఇరు జట్లకు ఎంతగానో దోహదపడతాయి. ఎవరి బలమెంతో? బలహీనత ఏంటో తెలుసుకునే వీలు ఈ సిరీస్ వల్ల కలుగుతుంది. ఆటగాళ్లు కూడా తమను తాము సరిదిద్దుకునే అవకాశం ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్ ద్వారా లభించనుంది.

రెండు జట్లు...
తొలి వన్డే మొహాలీలో జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు దిగ్గజ టీంలే. ఇటీవలే ఆసియా కప్ గెలిచి భారత్ జట్టు ఊపు మీద ఉంది. ఆస్ట్రేలియా జట్టు సంగతి సరే. ప్రపంచ ఛాంపియన్లలో మేటి జట్టు. దానిని ఎదుర్కొనడం అంత సులువు కాదు. బౌలింగ్, బ్యాటింగ్ పరంగా రాటు దేలి ఉన్న ఆ జట్టును నిలువరించడం అంత సాధ్యం కాదు. అయితే భారత్ సొంత మైదానంలో ఆడుతుండటం ఒకింత ప్లస్ అయినప్పటికీ ఈ సిరీస్ ను గెలుచుకోవడం ఒక సవాల్ గానే చెప్పుకోవాలి.
సీనియర్లకు...
భారత్ జట్టులో రోహిత్ శర్మ, విరాట్, కొహ్లి, హార్ధిక్ పాండ్యా, కులదీప్ యాదవ్ లు తొలి రెండు వన్డేలు ఆడటం లేదు. వారికి విశ్రాంతి నిచ్చారు. కేఎల్ రాహుల్ నాయకత్వంలో జట్టు తొలి మ్యాచ్ ఈరోజు ఆడనుంది. మంచి ఫామ్ లో ఉన్న ఆస్ట్రేలియా జట్టును అన్ని విధాలుగా నిలువరించాల్సి ఉంటుంది. తొలుత ఆ జట్టు బ్యాటింగ్ కు దిగితే తక్కువ స్కోరుకు అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు బౌలర్లు శ్రమించాల్సి ఉంటుంది. అలాగే అత్యధిక పరుగులు చేస్తే మాత్రం భారత్‌కు ఛేజింగ్ పెద్ద సమస్యగా మారనుంది. మరి సిరీస్ ఏమవుతుందో తెలియదు కాని ప్రపంచ కప్ ముందు భారత్ జట్టుకు ఈ సిరీస్ ఒక స్పెషల్ రిహార్సల్స్ గానే పేర్కొంటున్నారు క్రీడాపండితులు.


Tags:    

Similar News