India vs England : టెస్ట్ సిరీస్ సమం అయింది.. ఇక టీ20 సిరీస్ పైనే గురి
ఇండియా- ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ సమం అయింది.టెస్ట్ సిరీస్ డ్రా కావడంతో టీ 20 సిరీస్ కు సిద్ధమవ్వాల్సి ఉంటుంది
ఇండియా- ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ సమం అయింది. అందరూ ఊహించినట్లుగా సీనియర్లు లేకుండా ఈ జట్టు ఎలా నెగ్గుకొస్తుందేమోనని అనుమానించిన వారికి టీం ఇండియా గట్టి జవాబు ఇచ్చింది. బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణించడంతో సిరీస్ సమం చేయగలిగింది. అసలు ఒకదశలో సిరీస్ ను నెగ్గే ఛాన్స్ వచ్చినప్పటికీ స్వీయ తప్పిదాల కారణంగా చేజార్చుకున్న భారత యువ జట్టు పరవాలేదనిపించింది. ఎందుకంటే సీనియర్లు రోహిత్ శర్మ లేరు. విరాట్ కోహ్లి ఆడలేదు. అయినా యువ జట్టు ఇంగ్లండ్ జట్టుకు గట్టి జవాబు ఇవ్వగలిగింది. అంటే సమిష్టి కృషి అని చెప్పాలి. ముఖ్యంగా కొత్తగా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన శుభమన్ గిల్ కు ఈ సిరీస్ మంచి మార్కులు అందించాయని చెప్పాలి. ఐదు మ్యాచ్ లలో 754 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచి కెప్టెన్సీ ఇలా ఉండాలని గిల్ చూపించాడు.
వచ్చే ఏడాది...
టెస్ట్ సిరీస్ డ్రా కావడంతో టీ 20 సిరీస్ కు సిద్ధమవ్వాల్సి ఉంటుంది. టెస్ట్ సిరీస్ 2 - 2 తో డ్రాగా ముగియడంతో ఇప్పుడు అందరి చూపు టీ 20 పైనే ఉన్నాయి. అయితే ఈ సిరీస్ కు ఇంకా చాలా సమయం ఉ:ది. వచ్చే ఏడాది ఈ టీ20 సిరీస్ జరగనుంది. మొత్తం ఐదు టీ20 మ్యాచ్ లను భారత్ ఇంగ్లండ్ తో ఆడనుంది. ఇందుకు భారత యువజట్టును పంపించనున్నారు. ప్రయోగాలకు ఇది సమయం కాకపోయినా మంచి ఆటగాళ్లకు విదేశీ గడ్డపై నిలకడతనాన్ని సంపాదించుకోవాలన్నా, కొత్త ఆటగాళ్లకు అవకాశం దక్కాలన్నా ఇటువంటి సీరీస్ ఎంతో ఉపయోగం కానున్నాయి. జులై 2026వ తేదీ నుంచి టీ20 సిరీస్ కోసం వచ్చే ఏడాది టీం ఇండియా ఇంగ్లండ్ లో పర్యటించనుంది. జులై 1వ తేదీ నుంచి జులై 11వతేదీ వరకూ టీ 20 మ్యాచ్ సిరీస్ ఇంగ్లండ్ లో జరగనున్న నేపథ్యంలో టీం ఇండియా జట్టులో ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ఐపీఎల్ లో క్లిక్ అయిన...
ఇంగ్లండ్ లోని డర్హమ్, నాటింగ్ హామ్, బ్రిస్టల్, సౌతాంప్టన్ లలో వరసగా ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. అయితే టీ20 మ్యాచ్ లలో ట్రాక్ రికార్డు భారత్ వైపు ఉంది. గతంలోనూ జరిగిన పలు మ్యాచ్ లలో భారత్ జట్టు పై చేయిగానిలిచింది. టీ20లకు కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించడంతో యువఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే జట్టుకు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించే అవకాశముంది. వీటీతో పాటు ఐపీఎల్ లో జట్లకు నాయకత్వం వహించిన పలువురు ఆటగాళ్లు కూడా ఆడనున్నారు. ప్రధానంగా సంజూ శాంసన్ తో పాటు అభిషేక్ శర్మ, రింకూసింగ్, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్ వంటి వారితో పాటు హార్ధిక్ పాండ్యా వంటి వారు కూడా ఈ టీం లో చోటు దక్కించుకునే అవకాశముంది. రిజర్వ్ బెంచ్ లో గత ఐపీఎల్ లో క్లిక్ అయిన కొందరి ఆటగాళ్ల పేర్లను కూడా బీసీసీఐ పరిశీలిస్తుంది. మరి చివరకు ఫైనల్ జట్టు ఏంటన్నది చూడాలి.