India Vs England Fourth Test : మాంచెస్టర్ లో మనోళ్లు ఏంచేస్తారో... గణాంకాలు మాత్రం?
ఇండియా - ఇంగ్లండ్ ఫోర్త్ టెస్ట్ నేటి నుంచి మాంచెస్టర్ వేదికగా ప్రారంభం కానుంది
ఇండియా - ఇంగ్లండ్ ఫోర్త్ టెస్ట్ నేటి నుంచి మాంచెస్టర్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ భారత్ కు కీలకం. ఈ మ్యాచ్ లో భారత్ తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి. ఓడిపోతే ఇక సిరీస్ చేజారిపోయినట్లే. గెలిస్తే స్కోర్లు సమం అవుతాయి. డ్రా అయితే ఐదో మ్యాచ్ లో గెలుపు కోసం కృషి చేయాల్సి ఉంటుంది. దీంతో భారత్ ఆటగాళ్లకు ఈ మ్యాచ్ సవాల్ గా మారింది. అయితే రికార్డులు చూస్తే మాంచెస్టర్ పిచ్ పైన భారత్ కు ఎక్కువ ఓటములు కనిపిస్తున్నాయి. అదే సమయంలో డ్రా అయిన మ్యాచ్ లు కూడా ఉన్నాయి. అందుకే భారత్ అన్ని రకాలుగా మ్యాచ్ లో గెలిచేందుకే పోరాడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ ఉత్కంఠగా సాగుతుందని అంచనా వేస్తున్నారు.
మూడు మ్యాచ్ లలోనూ...
వాస్తవానికి భారత్ మూడు మ్యాచ్ లలో గెలుపు ముంగిట వరకూ వచ్చి ఆగిపోయింది. రెండు మ్యాచ్ లలో అతి తక్కువ పరుగుల తేడాతో ఓటమి పాలయింది. చేతికి అందిన మ్యాచ్ చేజారిపోయింది. చివరలో వచ్చే బ్యాటర్లు విఫలమవ్వడం విజయం దరిదాపుల్లోకి వచ్చిన మ్యాచ్ ను కాలితో తన్నుకున్నట్లయింది. దీంతో ఇంగ్లండ్ ఆధిక్యతతో కొనసాగుతుంది. అదే భారత్ రెండు మ్యాచ్ లలో చివరి స్థానాల్లో వచ్చిన వారు నిలకడగా ఆడి ఉంటే ఈపాటికి సిరీస్ భారత్ వశమయ్యేది. ఇప్పుడు టెన్షన్ ఉండేది కాదు. ఆ మ్యాచ్ లలో నిలకడలేమి, ఫీల్డింగ్ లో నిర్లక్ష్యం మ్యాచ్ లను వదులుకుని ఇప్పుడు విజయం కోసం పోరాడాల్సి వస్తుంది. అదే ఇప్పుడు టెన్షన్ పెడుతుంది.
రికార్డులు భయపెడుతున్నాయ్...
మాంచెస్టర్ లో భారత్ ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోవడంతో గణాంకాలు భయపెడుతున్నాయి. మాంచెస్టర్ లో భారత్ తొమ్మిది మ్యాచ్ లు ఆడగా భారత్ నాలుగింటిలో ఓటమి చవి చూసింది. ఐదు మ్యాచ్ లను డ్రాగా ముగించింది. అయితే ఎడ్జ్ బాస్టన్ లోనూ గణాంకాలు లేవన్నది కొందరు గుర్తు చేస్తున్నారు. అక్కడ ఒక్క మ్యాచ్ గెలవలేకపోయినా చివరకు ఇండియా గెలిచింది. అలాగే భారత్ మాంచెస్టర్ లో గెలుస్తుందన్న నమ్మకం క్రికెట్ అభిమానుల్లో ఉంది. గత రికార్డులను చూసి కాకుండా ఆటపై దృష్టిపెట్టి విజయం కోసమే పోరాడి గెలవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి మాంచెస్టర్ లో మనోళ్లు ఏం చేస్తారన్నది చూడాల్సి ఉంది. డ్రాగా ముగించినా తర్వాత మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను డ్రా చేసుకునే అవకాశముందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.