Inda Vs Australia Champions Trophy Semi Filnals : భారత్ ఫైనల్స్ కు వెళ్లాలంటే ఒకటే మార్గమట
నేడు భారత్ - ఆస్ట్రేలియా సెమీ ఫైనల్స్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుంది
నేడు భారత్ - ఆస్ట్రేలియా సెమీ ఫైనల్స్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇద్దరిలో గెలుపు ఎవరిదన్న దానిపై ఆసక్తికరమైన విశ్లేషణలు వెలువడుతున్నాయి. రెండు జట్లు బలాబలాలను పరిశీలిస్తే ఎవరు తీసిపోని విధంగా ఉంది. ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ లో బలంగా ఉండగా, భారత్ అన్ని విభాగాల్లో సత్తా చాటుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకూ భారత్ మూడు మ్యాచ్ లలో గెలిచి మంచి ఫామ్ లో ఉంది. ఆస్ట్రేలియా కూడా బౌలింగ్ లో కొంత తగ్గినట్లు కనిపిస్తున్నా బ్యాటింగ్ లో మాత్రం దానికి సాటి లేరు. కానీ ఆస్ట్రేలియాను తక్కువగా అంచనా వేస్తే ఇక కప్పు చేజారిపోతుంది.
జాగ్రత్తగా లేకుంటే...?
అందుకే భారత్ అడుగడుగునా జాగ్రత్తలు పాటించకలిగితేనే ఆస్ట్రేలియాను చిత్తు చేయవచ్చన్నది క్రీడా నిపుణుల అభిప్రాయం. అనేకసార్లు ప్రపంచ కప్ పోటీల్లోఇరుజట్లు తలపడితే ఆస్ట్రేలియాదే పై చేయి అయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ సెమీ ఫైనల్స్ లో గెలిస్తేనే ఫైనల్స్ కు చేరతాము. న్యూజిలాండ్ పై మనోళ్లు సత్తా చూపారు. మనకు స్పిన్నర్లు బలం. కివీస్ తో జరిగిన మ్యాచ్ లో స్పిన్నర్లే మనల్ని గెలిపించారు. ఆస్ట్రేలియా ఒకే ఒక స్పిన్నర్ ఉండటంతో పాటు పేసర్లు కూడా పెద్దగా ఫామ్ లో లేకపోవడం భారత్ కు కలసి వచ్చే అంశమని చెబుతున్నారు. అందుకే నేడు జరిగే సెమీఫైనల్స్ లో భారత్ భారీ స్కోరు చేయగలిగితే ఆసీస్ పై వత్తిడి తెచ్చే అవకాశముంది.
బలాబలాలు...
ఆస్ట్రేలియా ఈ టోర్నీలో అడుగు పెట్టేముందు దానిపై ఎలాంటి ఆశలులేవు. కానీ అది అనూహ్యంగా పుంజుకుని సెమీ ఫైనల్స్ వరకూ దూసుకు వచ్చింది. కొత్త ఆటగాళ్లతో బరిలోకి దిగిన ఆసీస్ ఛాంపియన్స్ ట్రోఫీలో పుంజుకుంది. మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, హేజిల్ వుడ్ వంటి పేసర్లు లేరు. గాయాల కారణంగా గటోర్నీకి దూరమయ్యారు. పేస్ విభాగం బలహీనంగా ఉండటం భారత్ కు బలం. అయితే బ్యాటింగ్ లో దానిని కొట్టేవారు లేరు. అందరూ ఉద్దండులే. హెడ్ మళ్లీ ఫామ్ లోకి రావడంతో పాటు మిడిల్ ఆర్డర్ వరకూ బ్యాట్ తో దంచేవాళ్లే. ఛేదనలో భయపడే అవకాశం లేని వాళ్లు.అలాంటిది ఈరోజు జరిగే మ్యాచ్ మాత్రం ఆషామాషీ కాదు. కానీ ఆన్ని విభాగాల్లో బలంగా భారత్ ను ఢీకొట్టాలంటే ఆసిస్ కూడా అన్ని రకాలుగా ప్రయత్నించాలే. మరిచూడాలి చివరకు గెలుపు ఎవరిదో.