India vs Australia : రెండో టీ 20లో ఆస్ట్రేలియాపై భారత్ ఓటమి... అదే కారణం
భారత్ - ఆస్ట్రేలియా మధ్య మెల్ బోర్న్ లో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధించింది
భారత్ - ఆస్ట్రేలియా మధ్య మెల్ బోర్న్ లో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. భారత్ పై నాలుగు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలిచింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్ ను ఎంచుకుంది. అయితే తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలింది. ఒక్కఅభిషేక్ శర్మ మాత్రమే బాగా ఆడారు. శుభమన్ గిల్ ఐదు పరుగులు, సంజూ శాంసన్ రెండు పరుగులు చేసి అవుటయ్యారు. సూర్యకుమార్ యాదవ్ ఒక్క పరుగు చేసి వెనుదిరిగాడు. హర్షిత్ రాణాతో కలసి అభిషేక్ శర్మ నిలబడి స్కోరు బోర్డును వేగం పెంచాడు.
టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో...
అభిషేక్ శర్మ 37 బంతుల్లో 68 పరుగులు చేశాడు. అయితే బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో టీం ఇండియా ఇరవై ఓవర్లు ఆడాల్సి ఉండగా, 18.4 ఓవర్లకే 125 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. తొమ్మిది మంది బ్యాటర్లు కేవలం ఒక అంకె స్కోరును మాత్రమే చేయగలిగారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హాజల్ వుడ్ టీం ఇండియా టాప్ ఆర్డర్ ను కుప్ప కూల్చాడు. మూడు వికెట్లు పడగొట్టాడు. జేవియర్ బార్ట్ లెట్, నాథన్ ఎల్లిస్ చెరో వికెట్ తీసుకున్నాడు. అక్షర్ పటేల్ రనౌట్ అయ్యాడు. దీంతో్ తక్కువ పరుగులకే భారత్ ఆల్ అవుట్ అయింది.
ఛేదనలో ఇబ్బంది లేకుండా...
అయితే ఛేదనలో ఆస్ట్రేలియా పెద్దగా ఇబ్బంది పడలేదు. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసిస్ మొదటి ఓవర్ నుంచే దూకుడుగా ఆడింది. మెల్ బోర్న్ పిచ్ తొలుత ఫీల్డింగ్ చేసిన వారికి ఫలితం అనుకూలం వస్తుందని అనుకున్న అంచనాలు నిజమయ్యాయి. ఆస్ట్రేలియా కేవలం 13.2 ఓవర్లలోనే భారత్ విధించిన లక్ష్యాన్ని అధిగమించింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ నలభై ఆరు పరుగులు, ట్రావిస్ హెడ్ 28 పరుగులు, జోస్ ఇంగ్లిస్ ఇరవై పరుగులు చేశాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, జస్ప్రిత్ బుమ్రా, కులదీప్ యాదవ్ తో రెండు వికెట్లు తీసుకున్నారు. భారత్ బౌలర్లు లక్ష్యం చిన్నది కావడంతో ఆస్ట్రేలియాను నిలువరించలేకపోయారు. వచ్చే నెల 2వ తేదీన మూడో మ్యాచ్ హోబర్ట్‌లో జరగనుంది.