India vs Australia : గుణపాఠాలు నేర్చుకుంటారా..బ్యాట్, బాల్ తిప్పుతారా?
ఆస్ట్రేలియాతో భారత్ తొలి వన్డేలో పేలవమైన ప్రదర్శన చూపింది. ఇటు బ్యాటర్లు, అటు బౌలర్లు రాణించలేకపోయారు
ఆస్ట్రేలియాతో భారత్ తొలి వన్డేలో పేలవమైన ప్రదర్శన చూపింది. ఇటు బ్యాటర్లు, అటు బౌలర్లు రాణించలేకపోయారు. ఫలితంగా పెర్త్ లో జరిగిన మ్యాచ్ లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలు కావాల్సి వచ్చింది. చాలా రోజుల తర్వాత భారత్ కు వన్డేల్లో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. 26 ఓవర్లలో కేవలం 136 పరుగులు మాత్రమే భారత బ్యాటర్లు చేయగలిగారు. టాప్ ఆర్డర్ విఫలం కావడంతో భారీ స్కోరు చేయలేకపోయింది. వర్షం పదే పదే పడటంతో డక్ వర్త్ లూయీస్ పద్ధతిలో యాభై ఓవర్ల మ్యాచ్ ను ఇరవై ఆరు ఓవర్లకు కుదించారు.
తొలి వన్డేలో ఓటమితో...
భారత్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేయగా, ఈ లక్ష్యాన్ని మరో ఐదు ఓవర్లు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా అధిగమించింది. ఆస్ట్రేలియాలతో మొత్తం మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. దీంతో ఆస్ట్రేలియా 1 - 0తో సిరీస్ పై ఆధిక్యంలో నిలిచింది. సిరీస్ ను గెలవాలంటే భారత్ బ్యాటర్లతో పాటు బౌలర్లు కూడా తమ చేతికి పని చెప్పాల్సి ఉంటుంది. గురువారం ఆడిలైడ్ లో భారత్ - ఆస్ట్రేలియా రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డి పోరాడాల్సి ఉంటుంది. ముందుగా బ్యాటింగ్ చేస్తే భారీ స్కోరు చేయాల్సి ఉంటుంది. అలాగే తొలుత బౌలింగ్ చేస్తే తక్కువ పరుగులకే ఆస్ట్రేలియాను ఆల్ అవుట్ చేయాల్సి ఉంటుంది.
కొద్దిపాటి మార్పులతో...
కానీ తొలి వన్డేలో ఓటమితో భారత్ జట్టులో మార్పులు ఉండే అవకాశముందన్న అంచనాలు వినపడుతున్నాయి. బ్యాటింగ్ లో పెద్దగా మార్పులు చేపట్టకపోయినా బౌలింగ్ లో మాత్రం మార్పులు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. రెండో మ్యాచ్ లో కులదీప్ యాదవ్ కు చోటు దక్కే అవకాశముంది. అయితే కులదీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకుంటే ఎవరిని తొలగిస్తారన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. వాషింగ్టన్ సుందర్ ను తప్పించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. లేకుంటే నితీశ్ కుమార్ రెడ్డిని తప్పించే అవకాశాలు కూడా కొట్టిపారేయలేం. మొత్తం మీద భారత్ మాత్రం రెండో వన్డే లో మార్పులతోనే మైదానంలోకి దిగే అవకాశముంది.