India vs Australia : వరల్డ్ కప్ లో ఈ ఇద్దరు ఆడేస్తున్నట్లేగా?

సిడ్నీ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది

Update: 2025-10-25 12:23 GMT

సిడ్నీ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో విక్టరీ సాధించడంతో ఇక ఈ ఇద్దరి జోడీ రానున్న వన్డే ప్రపంచ కప్ పోటీల్లో ఉంటారన్నది దాదాపుగా తేలిపోయింది. నిన్నటి వరకూ ఫామ్ లో లేరని ఇద్దరినీ రిటైర్ కావాలని వినిపించిన గొంతులే ఇప్పుడు సవరించుకుంటున్నాయి. ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ఇద్దరూ చెలరేగి ఆడటంతో ఇంతటి అద్భుతమైన విజయాన్నిభారత్ సాధించిందన్నది వాస్తవం. పెర్త్, ఆడిలైడ్ లో విరాట్ కోహ్లి డకౌట్ కాగా, రోహిత్ శర్మ తొలి మ్యాచ్ లో తక్కువ పరుగులు చేసి, రెండో మ్యాచ్ లో 73 పరుగులు చేశారు.

తక్కువ ఓవర్లలోనే ముగించి...
ఇక ఈరోజు సిడ్నీలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ను ఎంచుకుంది. 46.4 ఓవర్లలోనే ఆస్ట్రేలియా 236 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. భారత్ విజయ లక్ష్యం 237 పరుగులు కాగా, టీం ఇండియా ఈ టార్గెట్ ను కేవలం 38.3 ఓవర్లలోనే ఛేదించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి నాటౌట్ గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. తొలుత శుభమన్ గిల్ , రోహిత్ శర్మ ఓపెనర్లుగా దిగగా, గిల్ 24 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి నిలదొక్కుకుని నిదానంగా ఆడుతూ గత రెండు మ్యాచ్ ల నుంచి వచ్చిన విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు. రోహిత్ శర్మ కూడా చెలరేగి ఆడాడు.
అజేయంగా నిలిచిన ఇద్దరూ...
రోహిత్ శర్మ 121 పరుగులు చేసి అజేయంగా నిలవగా, విరాట్ కోహ్లి 74 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు ఆస్ట్రేలియాతో జరిగిన చివరి మ్యాచ్ లో రాణించడంతో వన్డే ప్రపంచ కప్ లో ఆడతారన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతుంది. కేవలం రెండు మ్యాచ్ లలో ఫామ్ లో లేకపోవడాన్ని చూసి రిటైర్ కావాలని కోరడం సరికాదంటూ, విరాట్ కోహ్లి బలం తెలిసిన వాళ్లు ఆ కామెంట్స్ చేయరని ఇప్పటికే మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు సిడ్నీలో నిజమయినట్లు కనిపించాయి. మొత్తం మీద సిడ్నీ ఇద్దరు సీనియర్, స్టార్ ఆటగాళ్ల పై వస్తున్న ట్రోల్స్ కు చెక్ పెట్టినట్లయింది.












Tags:    

Similar News