Asia Cup : భారత్ - పాక్ మ్యాచ్ లేపిన మరో దుమారం

ఆసియా కప్ లో భారత్ - పాక్ మ్యాచ్ లో షేక్ హ్యాండ్ కాంట్రవర్సీ అయింది.

Update: 2025-09-16 02:07 GMT

ఆసియా కప్ లో భారత్ - పాక్ మ్యాచ్ లో షేక్ హ్యాండ్ కాంట్రవర్సీ అయింది. ఆదివారం రాత్రి దుబాయ్ లోజరిగిన భారత్ - పాక్ మ్యాచ్ సందర్భంగా భారత్ ఆటగాళ్లు విజయం సాధించిన తర్వాత పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయకుండా వెళ్లిపోయిన ఘటనపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ మ్యాచ్ లో రిఫరీ షైక్రాఫ్ట్ పై చర్యలు తీసుకోవాలని పాక్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేస్తుంది. భారత్ - పాక్ ల మధ్య గత కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. పహాల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆదేశంతో ఆటలొద్దంటూ భారత దేశంలో ఎక్కువ మంది కోరుకుంటున్నారు. ఈ సమయంలో ఆసియా కప్ లో భారత్ - పాక్ తో జరిగిన తొలి సమరంలో భారత్ విజయం సాధించింది. అయినా ఎటువంటి సంబరాలు దేశంలో చేసుకోలేదు.

పాక్ ఫిర్యాదుతో...
అలాగే గెలిచిన తర్వాత మైదానంలో భారత ఆటగాళ్లు ఓడిపోయిన పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే తమ రూమ్ కు వెళ్లిపోయారు. పాక్ ఆటగాళ్లు మైదానంలో వేచి ఉన్నప్పటికీ భారత్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి వాళ్లు బయటకు రాలేదు. దీంతో దీనిని అవమానంగా భావించిన పాకిస్తాన్ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని, భారత ఆటగాళ్లు మైదానంలో చేసిన చర్యకు ప్రతి చర్య ఉండాల్సిందేనని, అందుకు బాధ్యుడిని చేస్తూ షైక్రాఫ్ట్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. కానీ టీం ఇండియా మాత్రం తాము పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయకపోవడాన్ని సమర్థించుకుంది. టాస్ వేసే సమయంలోనూ భారత్, పాక్ కెప్టెన్లు ఇద్దరూ కరచాలనం చేసుకోలేదు.
బీసీసీఐ నిర్ణయమే...
అయితే భారత్ లో నెలకొన్న పరిస్థితుల కారణంగానే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని తెలిసింది. అందువల్లనే ఇలా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా భారత ఆటగాళ్లు బయటకు వచ్చారంటున్నారు. ఇక ఆసియా కప్ లో పాకిస్తాన్ తో జరిగే ఏ మ్యాచ్ లోనైనా ఇలాంటి పరిస్థితే ఉంటుందని భారత్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే పాకిస్తాన్ మాత్రం ఇదే వైఖరి కొనసాగిస్తూ, ఐసీసీ చర్యలు తీసుకోకుంటే తాము ఆసియా కప్ నుంచి వైదొలగడానికి కూడా సిద్ధమని ప్రకటించేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తపరిస్థితులు చివరకు మైదానంలోకూడా కరచాలనంలో రూపంలో కనిపించడంతో అంతర్జాతీయ క్రీడల్లో చర్చనీయాంశంగా మారింది.


Tags:    

Similar News