Asia Cup : దాయాదీ అంత సీన్ లేదోయీ
ఆసియా కప్ లో భారత్ - పాకిస్తాన్ ల మధ్య షేక్ హ్యాండ్ వివాదం ఎటు వైపు వెళుతుందన్నది చర్చనీయాంశంగా మారింది
ఆసియా కప్ లో భారత్ - పాకిస్తాన్ ల మధ్య షేక్ హ్యాండ్ వివాదం ఎటు వైపు వెళుతుందన్నది చర్చనీయాంశంగా మారింది. తాజాగా బీసీసీఐ తీసుకున్న నిర్ణయంతో పాక్ నిర్ణయం ఎలా ఉంటుందన్న దానిపై క్రీడారంగంలో హాట్ టాపిక్ గా మారింది. ఆదివారం భారత్ పాకిస్తాన్ పై గెలిచిన తర్వాత టీం ఇండియా జట్టు పాకిస్తాన్ జట్టుతో కరచాలనం చేయకుండా వెళ్లిపోవడాన్ని అవమానంగా భావించిన పాకిస్తాన్ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రిఫరీపై చర్యలు తీసుకోవాలని కోరింది. కానీ ఐసీసీ మాత్రం రిఫరీ తప్పు ఏమీ లేదని తేల్చింది. రిఫరీ ఆండీ క్రాఫ్ట్ పై చర్యలు తీసుకోబోమని తెలిపింది.
హెచ్చరించినా...
అంతకు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి హెచ్చరికగా మ్యాచ్ రిఫరీపై చర్యలు తీసుకోకుంటే తాము ఆసియా కప్ నుంచి తప్పు కుంటామని హెచ్చరించింది. ఇప్పుడు ఐసీసీ రిఫరీపై చర్యలు తీసుకునేది లేదని క్లీన్ చిట్ ఇవ్వడంతో పాకిస్తాన్ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆసియా కప్ నుంచి తప్పుకునే చర్యకు దిగదు. ఎందుకంటే ఐసీసీ ఛైర్మన్ గా అమిత్ షా తనయుడు జై షా ఉన్నారు. తప్పుకుంటే పీసీబీకి భారీ జరిమానా విధించే అవకాశాలున్నాయి. అది ఆర్థికంగా మరింత పాకిస్తాన్ బోర్డుకు ఇబ్బందికరంగా మారే అవకాశాలున్నాయి.
భరించడం కష్టమే...
అందుకే పీసీబీ ఈ వివాదాన్ని మరిచిపోయేందుకు మాత్రమే ప్రయత్నిస్తుందన్న భావన వ్యక్తమవుతుంది. పీసీబీ భరించలేని జరిమానా ఐసీసీ విధిస్తే అది తమకు మరింత భారం అవుతుందన్న భావన క్రికెట్ బోర్టులో వ్యక్తమవుతుది. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు పరిస్థితి కూడా ఆశించినంత స్థాయిలో లేదు. దీంతో పాకిస్తాన్ మ్యాచ్ ఈరోజు యూఏఈతో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో గెలిచి పాకిస్తాన్ గ్రూప్ వన్ లో రెండో స్థానంలో సూపర్ 4కు చేరుకుంటుంది. ఇప్పటికే ఇండియా సూపర్ 4కు చేరుకోవడంతో పాకిస్తాన్ అంతటి కఠిన నిర్ణయాన్ని తీసుకునే ప్రయత్నం చేయదని, పాక్ కు అంత సీన్ లేదన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. ఈరోజు పాక్ యూఏఈతో మ్యాచ్ ఆడకతప్పదంటున్నారు.