IPL 2025 : చేతులెత్తేసిన ఢిల్లీ.. మళ్లీ గుజారాత్ దే విజయం
ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ కాపిటల్స్ జట్టుపై గుజరాత్ టైటాన్స్ విజయాన్ని సాధించి ప్లే ఆఫ్ రేసుకు చేరుకుంది
ఈ ఐపీఎల్ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ ఏ మాత్రం తడబడటం లేదు. ఆరంభం నుంచి అదరకొడుతూ కప్పు కొట్టే దిశగా అడుగులు వేస్తుంది. మంచి బ్యాటింగ్ పెర్ ఫార్మెన్స్ తో పాటు బౌలింగ్ లో కూడా సత్తా చూపుతుండటంతో అనేక విజయాలను అందుకుంది. ఈ సీజన్ లో మంచిగా తొలి నుంచి రాణించిన జట్టు ఏదైనా ఉందంటే అది గుజరాత్ టైటాన్స్ అని ఐపీఎల్ ను రెగ్యులర్ గా చూసే వారు ఎవరైనా చెబుతారు. మంచి రన్ రేట్ తో పాయిట్ల పట్టికలోనూ అగ్రస్థానం ఆక్రమించిందంటే ఆ జట్టు ఆటతీరు ఎలా ఉందో వేరే చెప్పాల్సిన పనిలేదు. నిన్న ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ కాపిటల్స్ జట్టుపై గుజరాత్ టైటాన్స్ విజయాన్ని సాధించి ప్లే ఆఫ్ రేసుకు చేరుకుంది. అది గెలవడమే కాదు.. పంజాబ్ కింగ్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బెర్త్ ను కూడా ఖరారు చేసింది.
మంచి స్కోరు చేసినా...
ఢిల్లీ కాపిటల్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే ఆరంభంలో అదరగొట్టిన ఢిల్లీ కాపిటల్స్ తర్వాత మాత్రం వరసగా అపజయాలను కొని తెచ్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కాపిటల్స్ లో కేఎల్ రాహుల్ నాటౌట్ గా నిలిచి 112 పరుగులు చేసి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. డుప్లెసిస్ ఐదు పరుగులకే అవుటటయినా పోరెల్ ముప్ఫయి పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ ఇరవై ఐదు పరుగులు చేసి పరవాలేదని పించాడు. స్టబ్స్ 21 పరుగులు చేయడంతో ఢిల్లీ కాపిటల్స్ జట్టు ఇరవై ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 199 పరుగులు చేసింది. అంటే గుజారాత్ టైటాన్స్ ముందు ఇరవై ఓవర్లలో రెండు వందల పరుగుల లక్ష్యాన్ని విధించినట్లయింది.
ఛేదనకు దిగిన...
తర్వాత ఛేదనకు దిగిన గుజారాత్ టైటాన్స్ ఏ దశలోనూ తడబడలేద. ఓపెనర్లు ఇద్దరూ సాయి సుదర్శన్, శుభమన్ గిల్ లు అదరగొట్టారు. అప్పుడే గుజారాత్ టైటాన్స్ విజయం ఖాయమనిపించింది. సాయి సుదర్శన్ 108 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. గిల్ కూడా నాటౌట్ గా నిలిచి 93 పరుగులు చేయడంతో ఓపెనర్లతోనే మ్యాచ్ ను ముగించి మరో రికార్డును గుజారాత్ టైటాన్స్ బ్రేక్ చేయగలిగింది. పందొమ్మిది ఓవర్లలోనే ఢిల్లీ కాపిటల్స్ విధించిన రెండు వందల పరుగుల లక్ష్యాన్నిఛేదించింది. 19 ఓవర్లలో 205 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఢిల్లీ కాపిటల్స్ బౌలర్లు ఎంత శ్రమించినా ఒక్క వికెట్ కూడా పడలేదు. దీంతో ప్లే ఆఫ్ రేసులో నాలుగో స్థానం కోసం ఇంకా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్లే ఆఫ్ రేసు కోసం ఇప్పుడు ముంబయి ఇండియన్స్, ఢిల్లీ కాపిటల్స్ జట్ల మధ్యే పోరు ఉంది.