మంకీగేట్ వివాదం గుర్తుందా ? హ‌ర్భ‌జ‌న్ ఏం అన్నాడు ? సైమండ్స్ ఏం విన్నాడు ?

2008లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో బోర్డ‌ర్ - గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా జ‌రిగిన ఇండియా - ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్‌ ఈ వివాదం

Update: 2022-05-15 05:33 GMT

హైదరాబాద్ : ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గ‌జం, ప్ర‌పంచ క్రికెట్‌లో అత్యుత్త‌మ ఆల్‌రౌండ‌ర్ల‌లో ఒక‌రైన ఆండ్రూ సైమండ్స్‌(46) రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌డాన్ని క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. రిటైర్ అయ్యి ప‌దేళ్లు అవుతున్నా ఇప్ప‌టికీ సైమండ్స్ ఆట అంద‌రికీ గుర్తుంది. ఆస్ట్రేలియాకు 2003, 2007లో రెండు వ‌న్డే ప్ర‌పంచ క‌ప్‌ల‌ను అందించ‌డంలో సైమండ్స్‌ది కీల‌కపాత్ర‌. క్రికెట‌ర్‌గా ఎన్నో గుర్తుండిపోయే మ్యాచ్‌ల‌ను ఆడిన సైమండ్స్‌కు మంకీగేట్ వివాదం మాత్రం చేదు జ్ఞాప‌కంలా మిగిలిపోయింది.

2008లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో బోర్డ‌ర్ - గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా జ‌రిగిన ఇండియా - ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్‌ ఈ వివాదం జ‌రిగింది. మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో భార‌త క్రికెట‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ - ఆండ్రూ సైమండ్స్ న‌డుమ వివాదం మొద‌లైంది. ఇద్ద‌రూ గ్రౌండ్‌లోనే వాద‌న‌ల‌కు దిగారు. సైమండ్స్ మీద ఆగ్ర‌హంతో తెరి మా కీ అని హ‌ర్భ‌జ‌న్ సింగ్ తిట్టాడు. ఈ ప‌దం సైమండ్స్‌కు మంకీ అని వినిపించింది.
హ‌ర్భజ‌న్ త‌న ప‌ట్ల జాత్యాహంకారం చూపించాడ‌ని, త‌న‌ను మంకీ అని పిలిచాడ‌ని సైమండ్స్ ఆరోపించాడు. దీంతో హ‌ర్భ‌జ‌న్ సింగ్‌పైన ఐసీసీ చ‌ర్య‌లు తీసుకుంది. ఆయ‌న‌పైన మూడు మ్యాచ్‌ల‌ నిషేధం విధించింది. అయితే, వివాదం జ‌రిగిన స‌మ‌యంలో హ‌ర్భ‌జ‌న్‌తో పాటు స‌చిన్ టెండుల్క‌ర్ కూడా బ్యాటింగ్ చేస్తున్నాడు. సైమండ్స్‌పైన జాత్యాంహాక‌ర‌పూరితంగా హ‌ర్హ‌జ‌న్ ఎలాంటి మాట అన‌లేద‌ని స‌చిన్ టెండుల్క‌ర్ వివ‌ర‌ణ ఇచ్చారు. దీంతో హ‌ర్భ‌జ‌న్‌పైన నిషేదం ఎత్తేసి జ‌రిమానా వింధించింది ఐసీసీ.
అయితే, మూడు వారాల క్రిత‌మే ఈ వివాదంపైన ఆండ్రూ సైమండ్స్ స్పందించాడు. ఈ వివాదం మాన‌సికంగా త‌న‌ను చాలా ఇబ్బంది పెట్టింద‌ని, ఈ వివాదం త‌ర్వాత ఎక్కువ‌గా మ‌ద్యం తాగ‌డానికి అల‌వాటు ప‌డ్డాన‌ని గుర్తుచేసుకొని బాధ‌ప‌డ్డాడు. ఎక్కువగా మ‌ద్యం తాగిన కార‌ణంగా జ‌ట్టులో స్థానం ద‌క్కించుకోలేక‌పోయాన‌న్నాడు. అక్క‌డి నుంచే త‌న జీవితం ప‌డిపోవ‌డం మొద‌లైంద‌ని గుర్తు చేసుకున్నాడు. ఈ వివాదం ప‌ట్ల ఆయ‌న ప‌శ్చాత్తాపం వ్య‌క్తం చేశాడు.
ఆ త‌ర్వాత 2011లో ఐపీఎల్‌లో హ‌ర్భ‌జ‌న్ సింగ్‌తో క‌లిసి ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుకు సైమండ్స్ ఆడాడు. చండీఘ‌డ్‌లో జ‌రిగిన ఒక మ్యాచ్‌లో ముంబై గెలిచిన త‌ర్వాత సైమండ్స్‌, హ‌ర్భ‌జ‌న్ ఆలింగ‌నం చేసుకొని ఒక‌రికి ఒక‌రు క్ష‌మాప‌ణ‌లు చెప్పుకున్నారు. దీంతో ఈ వివాదం ముగిసింది. సైమండ్స్ మ‌ర‌ణానికి హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంతాపం వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న గురించి తెలియ‌గానే షాక్‌కు గుర‌య్యాన‌ని, సైమండ్స్ చాలా త్వ‌ర‌గా లోకాన్ని వ‌దిలి వెళ్లిపోయాడ‌ని హ‌ర్భ‌జ‌న్‌ ట్వీట్ చేశాడు.


Tags:    

Similar News