India Vs England Fourth Test Match : టీం ఇండియా గెలవాల్సిన మ్యాచ్ లో కష్టాలు ముందే మొదలయ్యాయా?
ఇండియా - ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ మాంచెస్టర్ లో ఈ నెల 23వ తేదీన ప్రారంభం కానుంది
ఇండియా - ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ మాంచెస్టర్ లో ఈ నెల 23వ తేదీన ప్రారంభం కానుంది. అంటే ఇంకా మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే టీం ఇండియా ఆటగాళ్లు గాయాలపడి కొందరు, విశ్రాంతి కోసం మరికొందరు నాలుగో టెస్ట్ కు దూరమయ్యే అవకాశముందన్న వార్తలు కలవరపరుస్తున్నాయి. నాలుగో టెస్ట్ మ్యాచ్ భారత్ కు కీలకం. ఇది ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్. ఈ మ్యాచ్ గెలిస్తేనే సిరీస్ లో స్కోరు సమం అవుతుంది. లేకుంటే సిరీస్ ఒక మ్యాచ్ కు ముందే చేజారి పోతుంది. ఇప్పుడు టీం ఇండియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, జరుగుతున్న ప్రచారం ఇండియా ఫ్యాన్స్ ను కలవర పెడుతుంది.
పంత్ ది అనుమానమేనా?
ఇప్పటి వరకూ మూడు టెస్ట్ మ్యాచ్ లు ఆడితే ఇంగ్లండ్ రెండు మ్యాచ్ లో గెలవగా, ఒక మ్యాచ్ లో భారత్ విక్టరీ కొట్టింది. ఒక పాయింట్ తో భారత్ వెనకడి ఉంది. దీంతో నాలుగో టెస్ట్ మ్యాచ్ లో గెలిచి తీరాల్సిన పరిస్థితి భారత్ ది. కానీ మాంచెస్టర్ టెస్ట్ లో వికెట్ కీపర్ పంత్ ఆడే అవకాశాలపై ఇంకా స్పష్టత రాలేదు. పంత్ గాయాలతో బాధపడుతుండటంతో పంత్ నాలుగో మ్యాచ్ లో బరిలోకి దిగుతాడా? లేదా? అన్న సందిగ్దంలో ఉంది. పంత్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఈ పర్యటనలో అత్యధికంగా పరుగులు చేశాడు. సెంచరీ కూడా నమోదు చేశాడు. అలాంటి పంత్ గాయాల కారణంగా నాలుగో టెస్ట్ మ్యాచ్ కుదూరమయితే ఎలా అని భారత్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
సిరీస్ పై జీవంగా ఆశలుండాలంటే...
ఇక సిరీస్ పై ఆశలు సజీవంగా ఉండాల్సిన మ్యాచ్ కు జస్పిత్ బూమ్రాకు కూడా మాంచెస్టర్ మ్యాచ్ లో విశ్రాంతి ఇస్తారన్న బీసీసీఐ నిర్ణయం అభిమానులకు షాక్ కు గురి చేసేలా ఉంది. జస్పిత్ బూమ్రా తొలి టెస్ట్ లోనూ, మూడో టెస్ట్ లోనూ మ్యాచ్ ఆడాడు. వికెట్లు సరైన సమయంలో తీశాడు. అలాంటి బుమ్రా కు భారం తగ్గించాలన్న కారణంతో సిరీస్ లో ఎక్కువ మ్యాచ్ లు ఆడడని ముందుగానే కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తెలిపారు. బుమ్రా లీడ్స్, లార్డ్ టెస్ట్ మ్యాచ్ లలో ఆడి ఇంగ్లండ్ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టారు. సీనియారిటీతో పాటు వికెట్లు తీసే సత్తా ఉన్న బౌలర్ ను దూరం చేస్తే టీం ఇండియాకు నష్టం కలుగుతుందన్న ఆందోళన అభిమానుల్లో ఉంది. అయితే నాలుగో టెస్ట్ కు బుమ్రాను ఆడించి, ఐదో టెస్ట్ కు విశ్రాంతినిఇస్తే బాగుంటుందన్న సూచనలు కూడా వెలువడుతున్నాయి. మరి బీసీసీఐ నిర్ణయం ఎలా ఉంటుందన్నది చూడాల్సి ఉంది.