India Vs England Fourth Test : మాంచెస్టర్ మ్యాచ్ ను డ్రాగా ముగించడానికి కారణం వీరే
ఇండియా - ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ లో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది
ఇండియా - ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ లో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. నిజానికి ఈ మ్యాచ్ లో గెలుపు కన్నా డ్రా జరగాలనే అందరూ కోరుకన్నారు. గెలుపు విషయం పక్కన పెట్టి డ్రా చేసుకునే దిశగా ఆలోచించాలన్నది క్రీడా విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు. మాంచెస్టర్ వేదికలో గత గణాంకాలు చూసినా ఇక్కడ గెలుపు అసాధ్యం కావడంతో డ్రాగా ముగించుకుని ఐదో టెస్ట్ మ్యాచ్ లో గెలుపు కోసం ప్రయత్నించాలన్న అభిప్రాయం వ్యక్తమయింది. అయితే నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రా కావడానికి నలుగురు కారణమని చెప్పాలి. ముందుగా శుభమన్ గిల్ సెంచరీ చేసి కొంత జట్టులో ధైర్యాన్ని నింపాడు. వరసగా ఒకే ఓవర్లో తొలి రెండు వికెట్లు పడిన తర్వాత నిలదొక్కుకుని శుభమన్ గిల్ సెంచరీ చేశాడు.
రాహుల్ కు గుర్తింపు ఏదీ?
ఇక ఈ మ్యాచ్ లో సెంచరీ చేయకపోయినా బాగా ఆడింది కేఎల్ రాహుల్ అని చెప్పక తప్పదు. ఈ మ్యాచ్‌లో అందరి కంటే ఎక్కువ బంతులు ఆడింది కెఎల్ రాహుల్ మాత్రమే. 328 బంతులు ఆడి ఇంగ్లండ్ బౌలర్లకు చెమటలు పట్టించాడనే చెప్పాలి. టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ లో ఎన్ని పరుగుల చేశామన్న దానికన్నా ఎంత సేపు ఉన్నామన్నది ముఖ్యం. కేఎల్ రాహుల్ మాత్రం తన సీనియారిటీని అలా చూపించాడు. మూడు సెంచరీల మధ్య కేఎల్ రాహుల్ ను ఎవరూ పట్టించుకోలేదు కానీ నిజానికి రాహుల్ అతి విలువైన బ్యాటింగ్ చేశాడని చెప్పాలి. చేసింది 90 పరుగులు మాత్రమే అయినా అత్యధిక ఓవర్లు ఆడాడు. అన్ని రకాల బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొని కేఎల్ రాహుల్ నిలబడటం వల్లనే మ్యాచ్ డ్రా అయిందని చెప్పాలి.
ఓటమి ఖాయమని భావిస్తున్న సమయంలో...
ఇక మాంచెస్టర్ మ్యాచ్ లో ఓటమి ఖాయమని భావిస్తున్న సమయంలో ఆల్ రౌండర్లుగా పేరున్న రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లు అసమాన్య ప్రతిభను కనపర్చారు. చాలా ఓర్పుతో ఆడారు. ప్రతి బంతిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ వికెట్లు పడకుండా ఇద్దరూ సెంచరీలు చేయడమే కాకుండా మాంచెస్టర్ మ్యాచ్ లో భారత్ ను ఓటమి నుంచి తప్పించారు. జడేజా, సుందర్ ల జోడీని విడదీయడానికి ఇంగ్లండ్ బౌలర్లు శక్తివంచన లేకుండా శ్రమించినా వారు ఏమాత్రం అవకాశమివ్వకపోడం వారి నిలకడతనానికి నిదర్శనమని చెప్పాలి. మాంచెస్టర్ మ్యాచ్ లో భారత్ ఓటమి పాలు కాకుండా డ్రా అవ్వడానికి గిల్, రాహుల్, జడేజా, వాషింగ్టన్ సుందర్ లే కారణమని చెప్పక తప్పదు.