India Vs England First One Day : వీళ్లతోనే అసలు సమస్య...నిలబడతారో? లేదో? నమ్మకం లేకపాయె
భారత్ - ఇంగ్లండ్ మధ్య నేడు తొలి వన్డే జరగనుంది. నాగ్ పూర్ వేదికగా ఈ మ్యాచ్ మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమవుతుంది
భారత్ - ఇంగ్లండ్ మధ్య నేడు తొలి వన్డే జరగనుంది. నాగ్ పూర్ వేదికగా ఈ మ్యాచ్ మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే టీ 20లలో 4 - 1 సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్ వన్డేలలో ఏ రకమైన పెర్ ఫార్మెన్స్ చూపుతుందనేది అభిమానులకు టెన్షన్ గా ఉంది. వన్డే మ్యాచ్ లకు వచ్చేసరికి జట్లలో మార్పులు చోటు చేసుకున్నాయి. సీనియర్ ఆటగాళ్లు జట్టులోకి వచ్చేస్తున్నారు. కెప్టెన్ గా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు కూడా ఈ మ్యాచ్ లు కూడా ఆడుతున్నారు. మొత్తం ఐదు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను కూడా కైవసం చేసుకోవాలని భారత్ తహతహలాడుతున్నా సీనియర్ ఆటగాళ్ల ఫామ్ పైనే ఇప్పుడు అందరి అనుమానాలు బలంగా ఉన్నాయి.
పేలవమైన ప్రదర్శన...
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు పేలవమైన ఫామ్ లో కొనసాగుతున్నారు. ఈ వన్డే జట్టులో ప్రధానంగా వారే కావడంతో వారు విఫలమయితే అది ఇంగ్లండ్ కు వరంగా మారుతుంది. అదే క్రికెట్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. టెస్ట్ సిరీస్ లలోనూ పూర్ పెర్ ఫార్మెన్స్ చూపడంతో వీరిపై నమ్మకం పూర్తిగా సడలిపోయింది. యువ ఆటగాళ్లయితే జట్టును విజయతీరాలకు చేర్చగలరన్న నమ్మకం ఏర్పడింది. కానీ వీరు జట్టును వదిలిపెట్టడానికి సిద్ధంగా లేకపోవడంతో బీసీసీఐ కూడా చేతులెత్తేసినట్లే కనిపిస్తుంది. చివరకు ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో కూడా విఫలం కావడంతో భారత్ బ్యాటింగ్ ఆర్డర్ పై అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.
స్పిన్నర్లకు అనుకూలం...
నాగపూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని భావించి వారిని జట్టులోకి తీసుకునే అవకాశముంది. అదే సమయంలో పంత్, శుభమన్ గిల్ మాత్రం ఫామ్ లో ఉన్నారు. శ్రేయస్ అయ్యర్ ది గాలివాటపు ప్రదర్శనే. ఇలా అనుమానాల మధ్య భారత జట్టు బరిలోకి దిగుతుంది. మరోవైపు బట్లర్ సేన మాత్రం మంచి ఊపు మీదుంది. టీ 20 సిరీస్ ను కోల్పోయినప్పటికీ వన్డే సిరీస్ ను చేజిక్కించుకోవాలని కసితో గ్రౌండ్ లోకి దిగుతుంది. మనోళ్లు ఫామ్ లోకి వస్తే పరవాలేదు. కనీసం కొన్ని ఓవర్లయినా క్రీజులో నిలబడితే భారత్ కు గుడ్ న్యూస్ అందుతుంది. అలా కాకుండా ఎప్పటిలాగే పెవిలియన్ దారి పడితే తర్వాత వచ్చే బ్యాటర్లపై భారం పడుతుంది. మొత్తం మీద వన్డే సిరీస్ ను సీనియర్ ఆటగాళ్లు ఉన్నారన్న భరోసా లేకపోగా, టెన్షన్ మాత్రం ఎక్కువగానే కనిపిస్తుంది.