India Vs New Zealand Champions Trophy : రెండు జట్లను భయపెడుతున్న బలహీనతలు
భారత్ - న్యూజిలాండ్ మధ్య ఫైనల్ పోరు ఆసక్తికరంగా సాగనుంది.
భారత్ - న్యూజిలాండ్ మధ్య ఫైనల్ పోరు ఆసక్తికరంగా సాగనుంది. దుబాయ్ లో జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్ లో బలాబలాలు, బలహీనతలు రెండు జట్లను భయపెడుతున్నాయి. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, న్యూజిలాండ్ మంచి ప్రతిభను కనపర్చాయి. భారత్ ఇప్పటి వరకూ లీగ్ మ్యాచ్ లో కానీ, సెమీ ఫైనల్స్ లో గాని వరస విజయాలతో దూసుకు వచ్చింది. న్యూజిలాండ్ అయితే భారత్ తో తప్పించి ఆడిన అన్ని మ్యాచ్ లలోనూ గెలిచింది. అంతేకాదు భారీ స్కోరు సాధించింది. పాకిస్థాన్, సౌతాఫ్రికా మీద భారీ స్కోరు చేయడంతో ఈ జట్టు బ్యాటింగ్ పరిస్థితి ఎవరికీ వేరే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే బ్యాటింగ్ పరంగా అది బలమైన జట్టుగానే భావించాలి. అయితే న్యూజిలాండ్ బౌలింగ్ పరంగా కొంత బలహీనంగా ఉందని చెప్పాలి.
ఓపెనర్లుగా వచ్చి...
ఇక భారత్ విషయానికి వస్తే ఓపెనర్లు నిలకడగా ఆడాల్సి ఉంది. శుభమన్ గిల్ ఒక్క మ్యాచ్ లో తప్పించి అన్నింటా త్వరగా అవుటయ్యాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఒకే ఒక మ్యాచ్ లో పరవాలేదనిపించినా మిగిలిన అన్ని మ్యాచ్ లలో విఫలమయ్యాడు. విరాట్ కోహ్లి ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ చేసి పరవాలేదనిపించాడు. మరొక సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ సెమీ ఫైనల్స్ లో ఆస్ట్రేలియాపై మంచి పరుగులు సాధించి భారత్ జట్టు విజయానికి కారణమయ్యాడు. ఓపెనర్లతో పాటు సీనియర్ ఆటగాళ్లు వరసగా ఇబ్బందులు పడుతూ అవుట్ అవుతుండటంతో తర్వాత వచ్చే వారిపై వత్తిడి అధికంగా ఉంది. అయినా అదృష్టం మనవైపు ఉండి మ్యాచ్ లన్నీ గెలిచాం.
ఫీల్డింగ్ విషయంలో...
మరో ముఖ్యమైన విషయం ... న్యూజిలాండ్ ఫీల్డింగ్ ను ఎంత అభినందించినా తక్కువే. దాదాపు అందరూ ఆటగాళ్లు కష్టమైన క్యాచ్ లను కూడా పట్టేసి ప్రత్యర్థిని పెవిలియన్ బాట పట్టిస్తున్నారు. కేన్ మామ, ఫిలిప్స్ ల గురించి సోషల్ మీడియాలో ఒకటే ప్రశంసలు. బౌండరీకి వెళ్లకుండా ఆ జట్టు మొత్తం శ్రమించే తీరు క్రికెట్ ఫ్యాన్స్ ను అబ్బుర పర్చే విధంగా ఉంది. కానీ భారత్ జట్టు ఫీల్డింగ్ లో కొంత వెనకబడి ఉందనే చెప్పాలి. క్యాచ్ లను చేజార్చడం, బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపలేక ఆపసోపాలు పడటం మనోళ్లకు అలవాటుగా మారింది. ఓపెనర్లు నిలదొక్కుకుని, ఫీల్డింగ్ పై భారత్ ఆటగాళ్లు శ్రద్ధ పెడితే మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ మనదవుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.